
మండల సర్వసభ్య సమావేశం రసాభాస
పొదలకూరు: మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా శనివారం మారింది. టీడీపీకి చెందిన కొందరు నేతలు కలగజేసుకొని సభలోకి రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సభ్యులు, నేతల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న ఎస్సై హనీఫ్.. సమావేశం వద్దకొచ్చి బందోబస్తును నిర్వహించడంతో సభను ఎంపీపీ సుబ్బరాయుడు, వైస్ ఎంపీపీ వేణుంబాక చంద్రశేఖర్‌రెడ్డి యథావిధిగా నిర్వహించారు.
జరిగిందిదీ..
సొసైటీ చైర్మన్‌గా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ మండలాధ్యక్షుడు తలచీరు మస్తాన్‌బాబు ప్రొటోకాల్ మేరకు సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఆయనతో పాటు కొందరు నేతలు హాజరై బయటే ఉన్నారు. సభ ప్రారంభమయ్యాక అధికారుల గైర్హాజరుపై పొదలకూరు బిట్ – 4 ఎంపీటీసీ సభ్యుడు గుంటి శ్రీనివాసులు ప్రశ్నలేవనెత్తారు. దీంతో మస్తాన్‌బాబు.. శ్రీనివాసులు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో బయటున్న టీడీపీ నేతలు సభలోకి చొచ్చుకొచ్చి, సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఫలితంగా అరుపులు, కేకలతో గందరగోళం నెలకొంది. సభలోనే ఉన్న కొందరు సభ్యులు, వైస్ ఎంపీపీ సర్దిచెప్పడంతో వారు వెళ్లిపోయారు. దీంతో హాజరైన అధికారులతో సమీక్షను నిర్వహించారు. కొద్దిసేపటి తర్వాత సభాహక్కులు, నియమ నిబంధనలపై దుగ్గుంట ఎంపీటీసీ సభ్యుడు కేతు రామిరెడ్డి మాట్లాడటంతో సొసైటీ చైర్మన్, వైస్ ఎంపీపీ, సభ్యుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది. ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరం వద్దకు ఎస్సై వచ్చి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తును నిర్వహించారు.
దాడికి యత్నించారు
సభలోకి ఇతరులు ప్రవేశించి తనపై దాడికి యత్నించారని పొదలకూరు బిట్ – 4 ఎంపీటీసీ సభ్యుడు గుంటి శ్రీనివాసులు ఆరోపించారు. అధికారులతో తానెప్పుడూ గౌరవంగానే మాట్లాడతానని, అయితే రెండు, మూడు సమావేశాలకు వీరు సక్రమంగా హాజరుకాకపోవడంతో సభ దృష్టికి తీసుకురావాల్సి వచ్చిందన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు సభలోకి చొచ్చుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
టీడీపీ నేతలు చొచ్చుకురావడంతో
ఉద్రిక్తత
అరుపులు, కేకలతో గందరగోళం
సభ్యులు, నాయకుల మధ్య వాగ్వాదం
పోలీస్ బందోబస్తుతో ముగిసిన సభ