
రూ.8. లక్షల ఇన్సూరెన్స్ సొమ్మును కాజేశారు
కోవూరు/నెల్లూరు(అర్బన్) : నా భర్త మరణాంతరం ఇన్సూరెన్స్ సంస్థ నుంచి వచ్చిన రూ.8 లక్షల మొత్తాన్ని గిరిజన సంఘ నేతలమని చెప్పుకునే యానాదుల సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉషా కలిసి కాజేశారని మండలంలోని గుమ్మలదిబ్బ సమీపంలో ఉన్న గాంధీ జనసఘం గిరిజన కాలనీకి చెందిన ఈగ మార్తమ్మ ఆరోపించారు. గిరిజన సంఘ నేతలమని చెబుతూ గిరిజనులనే మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, బుధవారం జాయింట్ కలెక్టర్ కే కార్తీక్‌ను కలిసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. బాధిత గిరిజన మహిళ ఈగ మార్తమ్మ భర్త పసుపులేటి సురేందర్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబ సమస్యలతో 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కోవూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా, అందుకు సంబంధించి బీమా కంపెనీ నుంచి 2023లో రూ.8 లక్షల ఇన్సూరెన్స్ పరిహారం ఇండియన్ బ్యాంక్‌లోని ఆమె ఖాతా(033310 100222548)లో జమయ్యాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న గిరిజన సంఘ నేత కేసీ పెంచలయ్య కుట్రపూరితంగా వ్యవహరించి ఈ డబ్బులు నీవి కావు, నీ అకౌంట్లోకి పొరపాటున వచ్చాయని మార్తమ్మకు చెప్పారు. ఆ తర్వాత ఆమె బ్యాంక్ ఖాతా నుంచి గిరిజన సంఘ మహిళా నేత చెంబేటి ఉషా ఖాతా (0111917603)కు రూ.7 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారని మారతమ్మ ఆరోపిస్తోంది.
పెంచలయ్య, ఉషా వద్దనే ఏటీఎం, పాస్‌బుక్
తనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్, ఏటీఎం కార్డు, ఆధార్ వంటి ముఖ్యమైన పత్రాలన్నీ కేసీ పెంచలయ్య, ఉషా వద్దనే ఉంచుకుని, మిగతా డబ్బు లు కూడా కాజేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, అధికారులు జోక్యం చేసుకుని నాకు న్యాయం చేయాలని, గిరిజన సంఘా లు, మహిళా సంఘాలు స్పందించాలని కోరారు. బ్యాంక్ లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపి, తనను మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు.
అమాయక గిరిజనులను మోసం చేస్తున్నారు..
జేసీకి వినతిపత్రం అందించిన తర్వాత బాధితులు ఈగ మార్తమ్మ, గరునాధం చందు మాట్లాడుతూ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా చలామణి అవుతున్న కల్లూరు చిన పెంచలయ్య, చెంబేటి ఉషా అమాయక గిరిజన మహిళలకు రావాల్సిన నగదు కాజేస్తున్నారని ఆరోపించారు. అట్రాసిటీ కేసుల్లో న్యాయం చేస్తామని బాధితుల ఆధార్ కార్డు, పాస్‌బుక్‌లు, ఏటీఎం, పాన్‌కార్డులు వీరి చేతుల్లో పెట్టుకుని బ్యాంకు ఖాతాకు నాయకుల ఫోన్ నంబర్లు లింక్ చేయించుకున్నారన్నారు. అట్రాసిటీకి సంబంధించిన ప్రభుత్వం అందించే నష్టపరిహారం బ్యాంకు ఖాతాలో పడిన వెంటనే చెంబేటి ఉషా ద్వారా బాధితులను పిలిపించుకుని అరకొర చేతిలో పెట్టి పెద్ద మొత్తంలో నగదు కాజేస్తున్నారన్నారు. సజ్జాపురం గ్రామానికి చెందిన గురునాధం చందు భర్త వినోద్‌ను అగ్రవర్ణాల వారు విచక్షణారహితంగా కొట్టిన నేపథ్యంలో వచ్చిన పరిహారం మొత్తం రూ 1.75 లక్షలను కాజేశారన్నారు. మా మాదిరింగా ఎంతో మంది వీళ్ల చేతిలో మోసపోయారని తెలిపారు.
గిరిజనులనే మోసం చేసిన
ఆ సంఘ నేతలు
బాధితురాలు మారతమ్మ ఆవేదన
పోలీసులకు, జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు