
ఎవరికీ ఇబ్బంది లేకుండా భూసేకరణ
ఉలవపాడు: ప్రజలందరితో మాట్లాడి అందరిని సమన్వయం చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూ సేకరణపై ముందుకెళ్తామని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. బుధవారం కరేడు, ఉప్పరపాళెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయన మాట్లాడుతూ కరేడు ప్రాంతంలో మూడు గ్రామాలు తరలించాల్సిన అవసరం ఉందని, ఆ గ్రామాల్లో సుమారు 70 నుంచి 100 మందితో మాట్లాడినట్లు కలెక్టర్ చెప్పారు. వారికి భూసేకరణకు సంబంధించి చాలా అనుమానాలను ఈ మేరకు నివృత్తి చేశామని, వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌తో పాటు సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. ఎకరాకు రూ.20 లక్షలతోపాటు అదనంగా తోటలు, ఆక్వా కల్చర్ ఉంటే అదనంగా వారికి నగదు అందిస్తామని, రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. 80 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారని చెప్పారు. అందులో 13 ఎకరాలకు రూ.2.50 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు బుధవారం జమ అయినట్లు తెలిపారు. ముందుగా ఉప్పరపాళెం గ్రామస్తులతో కలెక్టర్ మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు ఒకేచోట ఇళ్లు ఇవ్వాలని కోరారు. హైవేపై గుడ్ న్యూస్ స్కూల్ వద్ద గ్రామాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మీకు నచ్చిన చోట భూమి లేకుంటే భూమికొని అయినా ఇస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించి ఇస్తామని తెలిపారు. చట్ట ప్రకారం ఇవ్వాల్సిన సదుపాయాలన్ని కల్పిస్తామని చెప్పారు. కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. ఉప్పరపాళెంలోని అంగన్‌వాడీ కేంద్రంలో భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. కరేడు 1వ సచివాలయాన్ని సందర్శించి అక్కడ హైవే పక్కన భూములు కోల్పోనున్న రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రీపూజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ సురేష్‌తోపాటు రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ ఆనంద్ స్పష్టీకరణ
ఉప్పరపాళెం, కరేడులో పర్యటన