
విద్యార్థులకు అస్వస్థత.. తల్లిదండ్రుల ఆందోళన
తోటపల్లిగూడూరు: మండలంలోని కోడూరులో ఉన్నడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల కళాశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి ఆరుగురి విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కళాశాలలో రెండేళ్లుగా మంచినీటి సమస్య ఉందని, నాణ్యమైన భోజనం అందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అనేక సార్లు నిరసనలు వ్యక్తం చేసినా కళాశాల యాజమాన్యం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఉన్నతాధికారుల పరిశీలన
సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల కళాశాలలో ఫుడ్ పాయిజన్ విషయం వెలుగులోకి రావడంతో బుధవారం ఆ శాఖ జిల్లా కన్వీనర్ ప్రభావతి, స్థానిక తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఎంఈఓ జయరామనాయుడు తదితరులు కళాశాల, హాస్టల్, మెస్ భవనాలను పరిశీలించారు. విద్యార్థినుల అస్వస్థతకు ఫుడ్ పాయిజన్ కారణమని కోడూరు పీహెచ్‌సీ వైద్యాఽధికారి హేనా స్పష్టం చేయడంతో ఆ కోణంలో పరిశీలించారు.
తల్లిదండ్రుల నిరసన
కళాశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి ఆరుగురు విద్యార్థులను అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో విద్యార్థునులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున కళాశాలకు చేరుకొన్నారు. తమ బిడ్డలకు ఏమైందో అంటూ ఆందోళనలతో గంటల పాటు కళాశాల గేట్లు ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. పాఠశాల పేరెంట్స్ కమిటీ మెంబర్లు, కళాశాల ప్రిన్సిపల్ ఎస్తేరమ్మ నిర్లక్ష్య వైఖరి వల్లే విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తుందని ఆరోపించారు. రెండేళ్ల కలుషిత తాగునీరు, భోజనం సక్రమంగా లేదంటూ విన్నవించినా ఆమె పట్టించుకోలేని మండిపడ్డారు. తల్లిదండ్రులు నిలదీస్తే మా బిడ్డలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులకు అస్వస్థత.. తల్లిదండ్రుల ఆందోళన