
అప్పుడు జరిగితే..
వైఎస్సార్‌సీపీ హయాంలో చేసిన పనులకు సంబంధించి తీసిన ఫొటోను నేడు ఉపయోగిస్తూ ఈ కూటమి ప్రభుత్వంలో జరిపినట్లు బిల్లులు పెట్టుకుని నిధులను డ్రా చేస్తున్నట్లు విమర్శలున్నాయి. పారిశుద్ధ్య పనులను సంబంధించి 2024 ఫిబ్రవరి 6న డి.రవిచంద్ర పేరుతో రూ.5,12,610 డ్రా చేశారు. అప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడైన ఫొటోనే కూటమి ప్రభుత్వం వచ్చాక వినియోగించి 2024 జూలై 15వ తేదీన చౌడ నాగమణి పేరుతో రూ.2 లక్షలు డ్రా చేశారు. మళ్లీ ఇదే ఫొటోను ఆన్‌లైన్‌లో చూపిస్తూ 2024 డిసెంబర్ 10న తమ్మిరెడ్డి రవి పేరుతో రూ.2.05 లక్షలు డ్రా చేశారు. అక్కడితో ఆగకుండా అదే ఫొటోను ఉపయోగించి 2025 జనవరి 9న మరో రూ.2,46,500లు డ్రా చేశారు.
మండలంలోని కోడూరు మేజర్ పంచాయతీలో భారీగా నిధుల దుర్వినియోగమైనట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో తెలుగు తమ్ముళ్లు తూతూమంత్రంగా పనులు చేపట్టి రూ.లక్షల ప్రజా ధనాన్ని దోచుకున్నారని, ఇందుకు కొందరు కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది సహకరించారనే ఆరోపణలున్నాయి.
నకిలీ బిల్లులతో
రూ.లక్షలు దారి మళ్లింపు
● తెలుగుదేశం నాయకులకు
సహకరించిన సిబ్బంది
● గతంలో జరిగిన పనుల ఫొటోలను
ఉపయోగిస్తున్న వైనం
● ఇద్దరు కార్యదర్శుల తీరుపై ఆరోపణలు
తోటపల్లిగూడూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి పంచాయతీ ఖాతాలో రూ.11.50 లక్షలున్నట్లు రికార్డుల్లో ఉంది. అనంతరం విడతల వారీగా 15వ ఆర్థిక సంఘం బేసిక్ గ్రాంట్ నుంచి రూ.14.03 లక్షలు, టైట్ గ్రాంట్ అడ్జెస్ట్‌మెంట్ కింద మరో రూ.19.70 లక్షలు జమయ్యాయి. రూ.45.24 లక్షలకు గానూ ప్రస్తుతం కేవలం రూ.3.89 లక్షలున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏడాది కాలంలోనే దాదాపు రూ.41.76 లక్షల విలువైన పనులు చేసినట్లు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.
ఇలా బ్యాంక్ ఖాతాల్లోకి..
అధికారులు ఇష్టానుసారంగా పనులు చేపట్టి నిధుల దారి మళ్లింపునకు సహకరించారని ఆరోపణలున్నాయి. టీడీపీ నాయకుడు, వార్డు మెంబర్ అయిన తమ్మిరెడ్డి రవి పేరున పంచాయతీలో పనులు చేసినట్లు అప్పటి కార్యదర్శి గతేడాది జూలై నుంచి నవంబర్ వరకు రూ.18.50 లక్షల బిల్లులు పెట్టి నిధులు డ్రా చేశారు. అలాగే గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు మరో రూ.13.03 లక్షల పనులు అతను చేపట్టినట్లు తర్వాత వచ్చిన కార్యదర్శి గుంటి వెంకటేశ్వర్లు బిల్లులు పెట్టి నిధులను డ్రా చేశారు. ఇద్దరు కార్యదర్శులు ఒకే వార్డు మెంబర్ పేరుపైనే పెద్ద మొత్తంలో బిల్లులు పెట్టడంపై అనుమానాలకు తావిస్తోంది. ప్రజాప్రతినిధి అయిన వార్డు మెంబర్ పేరుతో బిల్లులు పెట్టడం, నిధులు డ్రా చేయడం చట్ట విరుద్ధం. కంప్యూటర్ ఆపరేటనరైన చౌడా నాగమణి పేరుతో గతేడాది జూలై నెలలో అప్పటి కార్యదర్శి శ్రీనివాసులు రూ.4 లక్షలు, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ప్రస్తుత కార్యదర్శి వెంకటేశ్వర్లు మరో రూ.2.21 లక్షల బిల్లులు చేయడం గమనార్హం.
తూతూమంత్రంగా..
ఏడాది పాలనలో పంచాయతీలో పారిశుద్ధ్య పనులు, వీధిలైట్ల కొనుగోలు, తాగునీటి సరఫరా, విద్యుత్ మోటార్ల కొనుగోళ్లు, మరమ్మతులు, జంగిల్ క్లియిరెన్స్ పనులకు రూ.లక్షలు వెచ్చించామని అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. అయితే తూతూమంత్రంగా చేపట్టిన పనులతోపాటు చేయని పనులకు సైతం నకిలీ బిల్లులు పెట్టి నిధులను దోచేశారని కొందరు అధికార పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. గ్రామసభలు, వార్డు సభ్యుల సంతకాలు, పంచాయతీ తీర్మానాలు లేకుండానే పనులు చేపట్టినట్లు రికార్డులు తయారు చేసి నిధులను దుర్వినియోగం చేశారని పలువురు వార్డు సభ్యులు చెబుతున్న మాట.
ఫిర్యాదులొస్తే విచారణ చేస్తాం
కోడూరు మేజర్ పంచాయతీలో నిధుల దుర్వి నియోగానికి సంబంధించి మాకు ఎలాంటి సమాచారం అందలేదు. ఫిర్యాదులొస్తే విచారణ జరుపుతాం. అవినీతి జరిగిందని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ పుట్టా రమణయ్య, డీఎల్‌పీఓ, నెల్లూరు

అప్పుడు జరిగితే..

అప్పుడు జరిగితే..

అప్పుడు జరిగితే..