
డీలర్ల చేతివాటం
నెల్లూరు(పొగతోట): రేషన్ దుకాణాల డీలర్లు చౌకబారు పనులకు పాల్పడుతున్నారు. దివ్యాంగులు, 65 సంవత్సరాల వయసు దాటిన వృద్ధులకు వారి ఇళ్లకు వెళ్లి రేషన్ పంపిణీ చేయాలి. అయితే దీనిమాటున డీలర్లు అక్రమాలు చేస్తున్నారని విమర్శలున్నాయి. సాధారణ కార్డుదారుల ఇళ్ల వద్దకు కూడా వెళ్లి వేలిముద్రలు వేయించుకుని డబ్బులు ఇచ్చేస్తున్నారు. సదరు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇలా మూలపేటలోని ఓ దుకాణంలో జరుగుతున్నట్లు తెలిసింది.
91 వేలమంది
జిల్లాలో 7.21 లక్షల రేషన్‌కార్డులున్నాయి. 1,513 చౌకదుకాణాల ద్వారా ప్రతినెలా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ను అందించింది. అయితే కూటమి ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేసింది. డీలర్ల ద్వారా పంపిణీని ప్రారంభించింది. ఈ అవకాశం వచ్చిన మొదటి నెలనుంచే వారు అక్రమాలకు తెరలేపారు. ప్రస్తుతం ప్రతినెలా 25 నుంచి 30వ తేదీ వరకు దివ్యాంగులు, 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జిల్లాలో 91 వేల మందికి పైగా దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులున్నారు. అధికారులు చౌకదుకాణాల వారీగా వారి వివరాలను పంపించారు. తూకంతో సంబంధం లేకుండా థంబ్ వేసి రేషన్ పంపిణీ చేయాలి. నిబంధనల ప్రకారం కార్డుదారులు ఎంతమంది ఉన్నారో అన్ని కేజీలకు సంబంధించి తూకం సక్రమంగా చూసినప్పుడే బిల్లు యంత్రం నుంచి బయటకు వస్తుంది. అయితే దివ్యాంగులు, వృద్ధుల సడలింపు ఇచ్చారు.
నగరంలోనే అధికంగా..
కొంతమంది బినామీ, బోగస్ కార్డులకు థంబ్ వేసి బియ్యంను చాటుమాటుగా తరలిస్తున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా డీలర్లను ప్రశ్నిస్తే తినడానికి బియ్యం లేవు, ఇవ్వాలని కార్డుదారులు డిమాండ్ చేస్తున్నారని సమాధానం చెబుతున్నారు. నెల్లూరు నగరంలో ఈ తంతు అధికంగా నడుస్తోంది. అక్రమంగా సేకరించిన బియ్యాన్ని అల్లీపురంలోని ఓ రైస్‌మిల్లుకు తరలిస్తున్నట్లు సమాచారం. చౌకదుకాణాలకు సంబంధించిన రేషన్ బియ్యంను అధికారులు అనుమతిచ్చిన వాహనాల్లోనే రవాణా చేయాలి. కానీ విరుద్ధంగా మినీ వ్యానుల్లో మిల్లులకు తరలించేస్తున్నారు. పట్టపగలే పేదల బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. డీలర్లకు కూటమి నేతల అండదండలు ఉండటంతో రెచ్చిపోతున్నారు. అధికారులు సైతం నేతల ఒత్తిళ్లకు తలొగ్గి డీలర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది.
బినామీ డీలర్లు
నెల్లూరులోని కొన్ని దుకాణాలకు సంవత్సరాల ఏళ్ల తరబడి బినామీలు డీలర్లుగా ఉంటున్నారు. మూలాపేట ప్రాంతంలో ఓ షాపునకు అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ డీలర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇలా బినామీ పేర్లతో నడిచే దుకాణాలు జిల్లా వ్యాప్తంగా వందకు పైగా ఉన్నట్లు సమాచారం. చౌకదుకాణాలపై 6ఏ కేసులు నమోదు చేసిన సమయంలో, డీలర్లను సస్పెండ్ చేసిన సమయాల్లో నిర్వహణను పొదుపు మహిళలకు అప్పగిస్తారు. వారు మూడు నెలలు మాత్రమే దుకాణం నిర్వహించాలని నిబంధన ఉంది. జిల్లాలో పొదుపు మహిళల పేరుతో 200కు షాపులు ఏళ్ల తరబడి బినామీల పేర్లతో కొనసాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఆయా డివిజన్ల ఆర్డీఓలు ఖాళీగా ఉన్న చౌకదుకాణాల వివరాలు సేకరించి ప్రతినెలా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఖాళీ అయిన షాపులకు డీలర్లను నియమించాలి. ఈ ప్రక్రియ నేడు కొనసాగడం లేదు. జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపడితే డీలర్లు నిబంధనలు పాటించే అవకాశముంది.
ఇళ్లకు వెళ్లి వేలిముద్రలు వేయించి
డబ్బులిస్తున్న వైనం
ఆపై రైస్‌మిల్లులకు బియ్యం తరలింపు
కూటమి నేతల అండదండలతో
బియ్యం దందా
విచారించి చర్యలు తీసుకుంటాం
ప్రతి నెలా 25 నుంచి 30వ తేదీ వరకు దివ్యాంగులు, 65 ఏళ్ల దాటిన వృద్ధులకు రేషన్ పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నిబంధనలు పాటించని డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. పూర్తి స్థాయిలో పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే డీలర్లపై చర్యలు చేపడతాం.
– విజయకుమార్, డీఎస్‌ఓ