
నగలు, నగదు మాయం
నెల్లూరు(క్రైమ్): ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయ కప్‌బోర్డులో ఉంచిన నగల బ్యాగ్, నగదు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. రంగనాయకులపేట మహాలక్ష్మి గుడి సమీపంలో పి.జిలానీబాషా నివాసం ఉంటున్నారు. అతను జీవీఆర్‌ఆర్ కళాశాల సమీపంలో రియల్ ఎస్టేట్ కార్యాలయం నిర్వహిస్తున్నాడు. కుదువలో ఉన్న తన 50 గ్రాముల బంగారు ఆభరణాలను ఈనెల ఒకటో తేదీన జిలానీ విడిపించారు. ఆభరణాలతోపాటు రూ.50 వేల నగదును బ్యాగ్‌లో పెట్టి కార్యాలయంలోని కప్‌బోర్డులో ఉంచారు. మరుసటిరోజు సాయంత్రం కార్యాలయానికి వచ్చిచూడగా బ్యాగ్ కనిపించలేదు. దీంతో బ్యాగ్ మాయమైన ఘటనపై బాధితుడు ఆదివారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో అష్రాఫ్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మోసంపై కేసు నమోదు
నెల్లూరు సిటీ: రైస్‌మిల్లు యజమాని ఫిర్యాదు మేరకు దళారిపై నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. నెల్లూరు బంగ్లాతోటకు చెందిన వడ్లమూడి వెంకటేశ్వర్లుకు నరుకూరు మార్గంలో రైస్‌మిల్లు ఉంది. అందులోని బియ్యాన్ని హైదరాబాద్‌లో అమ్ముతానని విజయవాడకు చెందిన దళారి కోట సత్యనారాయణ తీసుకెళ్లి వేరే ప్రాంతంలో తక్కువ ధరకు విక్రయించి మోసం చేశాడని బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఇన్‌స్పెక్టర్ గుంజి వేణు ఆదివారం తెలిపారు.
కేజీబీవీలపై ప్రత్యేక దృష్టి
● విద్యాశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ దేవరాజు
కడప ఎడ్యుకేషన్: ‘కేజీబీవీలపై ప్రత్యేక దృష్టి సారించాలి. వాటిల్లో చదువుతున్న విద్యార్థులను మట్టిలో మాణిక్యాలుగా తీర్చిదిద్దాలి’ అని రాష్ట్ర విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ దేవరాజు పిలుపునిచ్చారు. ఆదివారం కడప నగర శివార్లలోని గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో జీసీడీఓ దార్ల రూతు ఆరోగ్య మేరీ అధ్యక్షతన కేజీబీవీల్లో పనిచేసే ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ టీచర్లకు ఇన్ సర్వీస్ రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి రాయలసీమ పరిఽధిలోని కడప, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, నంద్యాలతోపాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా దేవరాజు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వారేనన్నారు. అలాంటి వారికి సేవ చేయడాన్ని అదృష్టింగా భావించాలని కోరారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చే వారే నిజమైన ఉపాధ్యాయులన్నారు. సమగ్రశిక్ష ఏపీసీ నిత్యానందరాజులు మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా మరిన్ని కొత్త విషయాలను నేర్చుకుని తరగతి గదిలో విద్యార్థులకు నేర్పించి వారి ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష కార్యాలయ సూపరింటెండెంట్ ప్రేమకుమారి, సెక్టోరియల్ అధికారి వీరేంద్రరావు, ఏఎస్‌ఓ సంజీవరెడ్డి, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.