
ఏటీఎం కార్డులు తారుమారు చేస్తూ..
నెల్లూరు(క్రైమ్): ఏటీఎం కార్డులను తారు మారుచేసి నగదు కాజేస్తున్న అంతర్‌జిల్లాల మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నెల్లూరులోని వేదాయపాళెం పోలీసుస్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు నిందితుడి వివరాలను వెల్లడించారు. వైఎస్‌ఆర్ నగర్‌కు చెందిన జ్యోతికి నిప్పో సెంటర్‌లోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఖాతా ఉంది. ఆమె తన భర్తతో కలిసి గతనెల 24వ తేదీన నిప్పో సెంటర్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వెళ్లారు. అక్కడ గుర్తుతెలియని వ్యక్తి సాయం చేస్తున్నట్లు నటిస్తూ నకిలీ ఏటీఎం కార్డును వారికిచ్చి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి జ్యోతి ఖాతాలోని రూ.15 వేలు నగదు విత్‌డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఈనెల 2వ తేదీన వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో సిబ్బంది సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పాతనేరస్తుడు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం వేములపాడు గ్రామానికి చెందిన ముప్పరాజు సురేంద్రగా గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం నిప్పో సెంటర్ సమీపంలో అదుపులోకి తీసుకుని విచారించగా నగదు కాజేసినట్లు అంగీకరించడంతో అరెస్ట్ చేశారు. సురేంద్ర నుంచి రూ.1,000 నగదు, వివిధ బ్యాంక్‌లకు సంబంధించిన ఏడు ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
● ఏటీఎం కార్డులను మార్చేసి నగదు కాజేయడంంలో సురేంద్ర సిద్ధహస్తుడని, అతడిపై ఇప్పటికే మేదరమిట్ల, పొదిలి, గిద్దలూరు, కందుకూరు, కావలి, తెనాలి, తూర్పుగోదావరి జిల్లాల్లో సుమారు 12 ఏటీఎం చీటింగ్, దొంగతనం కేసులున్నాయని ఇన్‌స్పెక్టర్ చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్సై జి.నవీన్, పీఎస్సై యు.సాయికల్యాణ్, సిబ్బందిని ఏఎస్పీ సీహెచ్ సౌజన్య అభినందించారు.
అంతర్‌జిల్లాల మోసగాడి అరెస్ట్
నిందితుడిపై ఇప్పటికే 12 కేసులు