
వైద్యశాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● ఏపీ హంస అసోసియేషన్ అధ్యక్షుడు చేజర్ల సుధాకర్‌రావు
నెల్లూరు(అర్బన్): వైద్యశాఖలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ (ఏపీ హంస) జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న యూటీఎఫ్ కార్యాలయంలో హంస జిల్లా, తాలూకాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రావు మాట్లాడుతూ 1998 నుంచి ఏఎన్‌ఎంలుగా పనిచేస్తూ ఉద్యోగోన్నతులకు నోచుకోకుండా పలువురు రిటైర్డ్ కాబోతున్నారని చెప్పారు. వారికి వెంటనే ఉద్యోగోన్నతలు కల్పించాలని కోరారు. చాలాకాలంగా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తూ రెగ్యులరైన హెల్త్ అసిస్టెంట్లకు, అలాగే ఆఫీస్ స–బార్డినేట్‌లకు పదోన్నతులు కల్పించాలని కోరారు. ఈ విషయాలపై పలుమార్లు డీఎంహెచ్‌ఓ సుజాతతో చర్చించామన్నారు. అనేక వినతుల నేపథ్యంలో ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓలకు పెండింగ్‌లో ఉన్న జీతాల సమస్యను రాష్ట్రస్థాయిలో క్లియర్ చేసినా జిల్లా స్థాయిలో చేయాల్సి ఉందన్నారు. కలెక్టర్, డీఎంహెచ్‌ఓతో చర్చించాక కో–ఆపరేటివ్ డిపార్ట్‌మెంట్‌లో ఓ బాధితుడికి కారుణ్య నియామకం పోస్టింగ్ ఇచ్చినందుకు ఏఓ నిశాంత్‌కి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నెల్లూరు జిల్లా శాఖ, నెల్లూరు రూరల్, బుచ్చి, కోవూరు, ఇందుకూరుపేట తాలూకా యూనిట్ల పరిధిలో ఉన్న ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో ఏపీ హంస గౌరవాధ్యక్షురాలు ఆర్.ఇందిర, సలహాదారు అరవ పరిమళ, అసోసియేట్ ప్రెసిడెంట్ నారాయణ రాజు, జిల్లా కోశాధికారి శేషగిరిరావు, ఉపాధ్యక్షులు రాజయ్య, గౌస్‌బాషా, అరుణారాణి, సుధాకర్‌రెడ్డి, మాధవ తదితరులు పాల్గొన్నారు.