
ప్రతి బిడ్డ సంరక్షణను బాధ్యతగా భావించండి
నెల్లూరురూరల్: అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్న ప్రతి బిడ్డ సంరక్షణను ఒక బాధ్యతగా భావించండి. చిన్నారుల బరువు, ఎత్తును సక్రమంగా నమోదు చేయండి. బలహీనంగా ఉన్న చిన్నారుల జాబితాను తయారు చేసి పౌష్టికాహారం క్రమం తప్పకుండా ఇవ్వండి. అంకితభావంతో విధులు నిర్వహిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఐసీడీఎస్ అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఉద్భోదించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో సీడీపీఓలు, సూపర్‌వైజర్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హేనాసుజన్ ప్రాజెక్ట్‌ల్లో చేపడుతున్న పలు కార్యక్రమాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగనన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు మంచి పోషణ అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు సీడీపీఓలు, సూపర్‌వైజర్లు ఒక బాధ్యతగా భావించాలని సూచించారు. బలహీనంగా ఉన్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారి తల్లిదండ్రులను కలిసి మాట్లాడాలని, వైద్యులను తీసుకెళ్లి చూపించాలన్నారు. ఖాళీగా ఉన్న అంగనన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పోస్టుల భర్తీకి సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆధార్ కార్డు లేని చిన్నారులను గుర్తించి త్వరగా ఇప్పించేందుకు ఎంపీడీఓలను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో సీడీపీఓలు, సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
అంకితభావంతో విధులు నిర్వహిస్తే మెరుగైన ఫలితాలు
ఐసీడీఎస్ అధికారులకు కలెక్టర్ ఆనంద్ దిశానిర్దేశం