
రుణాల కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలి
● ఏఎస్పీసీహెచ్ సౌజన్యకు వినతి
నెల్లూరు (క్రైమ్): బ్యాంకు రుణాల కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని బాధితులు యానాదుల సంక్షేమ సంఘం నాయకులతో కలిసి మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్యకు వినతిపత్రం అందజేశారు. యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ జాలె వాసుదేవనాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్ జిల్లాలోని కొందరు నిరుపేద ఎస్సీ, ఎస్టీలను సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా చూపించి నెల్లూరు, ముత్తుకూరు యాక్సిస్ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని మోసగించారన్నారు. ఈ వ్యవహారంలో కొంత మంది బ్యాంకు సిబ్బంది ప్రమేయం ఉందన్నారు. రుణాల కుంభకోణంపై ఎనిమిది నెలల కిందట కేసు నమోదైనప్పటికీ ఇంతవరకూ విచారణ సాగలేదన్నారు. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు చలంచర్ల లక్ష్మీనారాయణ, మోకా తనూజ, వాసు, యానాదుల సంక్షేమ సంఘం జిల్లా చైర్మన్ ఆర్.కృష్ణయ్య, జిల్లా అధ్యక్షుడు మానికల మురళి, మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష నాగరాజు, మాజీ డీవీఎంసీ సభ్యులు కొప్పోలు రఘు, డీవీఎంసీ సభ్యులు సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.