
నేనెప్పుడొస్తే అప్పుడే బడి
● టీచర్ నిర్వాకంతో స్కూల్ మూత
కావలి(జలదంకి): కావలి రూరల్ మండలం లింగంగుంటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితి దారుణంగా మారింది. ఇక్కడ నలుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. కృష్ణ అనే టీచర్ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఇతను తరచూ బడికి డుమ్మా కొడుతున్నాడని ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులకు మొబైల్‌లో మెసేజ్‌లు పెట్టి సెలవులు తీసేసుకుంటున్నాడు. ఒకే టీచర్ కావడంతో పాఠశాలను మూసివేయాల్సి వస్తుంది. రెండు రోజులుగా బడికి తాళాలు వేసి ఉన్నారు. దీంతో తల్లిదండ్రులు పిల్లల చదువులపై ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై కావలి ఎంఈఓ గోవిందయ్యను వివరణ కోరగా కృష్ణ సెలవు పెట్టినట్లు తనకు తెలియదన్నారు. టీచర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వైద్యశాఖలో
జేడీ విచారణ
నెల్లూరు(అర్బన్): వైద్యారోగ్య శాఖలో ఉప్పలపాటి నాగరాజు అనే వ్యక్తి మరో ఉద్యోగిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేడీ మల్లేశ్వరి మంగళవారం విచారణ జరిపారు. ఫిర్యాదుదారుడు పేర్కొన్న అంశాలకు సంబంధించి ఎన్‌ఆర్‌హెచ్‌ఎంలో సందీప్ అనే వ్యక్తి పనిచేస్తూ బదిలీపై తిరుపతికి వెళ్లాడు. అయినా అతను నెల్లూరులో పనిచేస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడని, గతంలో డీఎంహెచ్‌ఓకి అద్దె కారు పెట్టి ప్రైవేట్ డ్రైవర్‌ను పెట్టకుండా ప్రభుత్వ డ్రైవర్‌ను వినియోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే కాకుండా ఎన్‌ఆర్‌హెచ్‌ఎంలో ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టుల భర్తీలో రోస్టర్ పద్ధతి పాటించలేదని దానిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఈ అంశాలపై విచారణ అధికారిగా వచ్చిన జేడీకి మరో అర్జీని నాగరాజు అందజేశారు. అయితే విచారణ గురించి ఎవరికీ తెలియకుండా రహస్యంగా నిర్వహించారు.
కరేడులో మహిళా
సంఘాల ఐక్యవేదిక పర్యటన
ఉలవపాడు: కరేడు గ్రామంలో మహిళా సంఘాల ఐక్యవేదికకు చెందిన వారు మంగళవారం నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ జీఓ నంబర్ 43ను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. నిరుపయోగంగా కాకినాడ సెజ్‌లో చాలా భూమి ఉందన్నారు. అలాంటి చోట పరిశ్రమలు పెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో 1,200 రోజులుగా పోరాడుతున్న రైతులు విజయం సాధించారన్నారు. కరేడు రైతుల కోసం తాము కూడా పోరాడి విజయం సాధిస్తామని తెలిపారు. అరకొర ఉన్న పొలాలు లాగేసుకుంటే రైతులు ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో అఖిల భారత మహిళా సమాఖ్య జాతీయ నాయకురాలు వనజాక్షి, ఐద్వా సహాయ కార్యదర్శి రమణి, రాష్ట్ర కార్యదర్శి దుర్గాభవాని, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు?
ఉదయగిరి: ఉదయగిరిలో ఆల్‌ఖైర్ ఫంక్షన్ హాల్ ఆస్తి వివాదమై ఈనెల 11వ తేదీ సాయంత్రం జరిగిన హత్య కేసులో నిందితులు మంగళవారం రాత్రి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఈ కేసులో షేక్ మహ్మమద్ హామీద్‌ను వరుసకు బావలుగా ఉన్న గుంటుపల్లి మహ్మమద్ హనీఫ్, ఉమర్‌అలీ సోదరులు అత్యంత కిరాతకంగా జనం చూస్తుండగానే హత్య చేశారు. 13 కత్తిపోట్లు, 3 రాడ్డు దెబ్బలున్నట్లు వైద్యులు గుర్తించారు. నిందితులు వివిధ ప్రాంతాల్లో తల దాచుకున్నట్లు తెలిసింది. ఈ హత్యను ఓ యువకుడు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. తాము కేసు నుంచి బయటపడటం తేలిక కాదని గ్రహించిన నిందితులు సమీప బంధువు ద్వారా పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో హత్య జరిగిన మరుసటిరోజు మధ్యవర్తి పోలీసులకు టచ్‌లోకి వచ్చి లొంగిపోవడానికి ప్రయత్నించినట్లు సమాచారం. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మంగళవారం రాత్రి వరికుంటపాడు పోలీసుల సమక్షంలో లొంగిపోయినట్లు తెలిసింది. వారిని దుత్తలూరు స్టేషన్‌కు తరలించారు. తర్వాత కావలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా ఎస్పీ కార్యాలయం ఆదేశాల ప్రకా రం నెల్లూరుకు తరలించినట్లు సమాచారం.

నేనెప్పుడొస్తే అప్పుడే బడి

నేనెప్పుడొస్తే అప్పుడే బడి