
మా భూములు, ఇళ్లు ఇచ్చేది లేదు
● గిరిజనుల నిర్ణయం
ఉలవపాడు: పరిశ్రమల కోసం భూములు, ఇళ్లు ఇచ్చేది లేదని గిరిజనులు తీర్మానించారు. కరేడు ఎస్టీ కాలనీలో ఐదు కుగ్రామాల యానాదులు సోమవారం రాత్రి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వడానికి ఇష్టం లేదని చెప్పారు. జీఓ వచ్చిన తర్వాత గ్రామసభ నిర్వహించకుండా పొలాలకు, ఇళ్లకు నోటీసులు పంపించారు. సభ ఏర్పాటు చేసిన తర్వాత యానాది వర్గానికి 70 శాతం మంది భూములివ్వడానికి సిద్ధంగా ఉన్నారని అపోహను ప్రభుత్వం కల్పించింది. దీంతో వారు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మర్రిచెట్టు సంఘం, బాలకోటయ్య సంఘం, ఆకుతోట సంఘం, పొల్లు గట్టు సంఘం, ధర్మారెడ్డి సంఘం, మంద బయట సంఘం, అలగాయపాళెం ఎస్టీ కాలనీలకు చెందిన సభ్యులు చర్చించి భూములు ఇవ్వబోమని తీర్మానించారు. కార్యక్రమంలో యానాది సంఘం నాయకులు కత్తి బాలకోటయ్య, చేవూరి శ్రీనివాసులు, నటరాజు సురేష్, మస్తానమ్మ, పోలమ్మ, మాలకొండయ్య, సురేష్, వసంతమ్మ, చౌటూరి వెంకటరావు, కత్తి చెంచయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.