
ఎర్రచందనం దుంగల స్వాధీనం
● విలువ రూ.50 లక్షలు
● నలుగురు స్మగ్లర్ల అరెస్ట్
ఆత్మకూరు: నియోజకవర్గ పరిధిలోని చేజర్ల అటవీ ప్రాంతంలో అక్రమ రవాణాకు సిద్ధం చేసిన ఎర్రచందనంను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్ హెడ్ ఎల్.సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఎస్పీ పి.శ్రీనివాస్ నేతృత్వంలో ఆర్‌ఐ సాయిగిరిధర్, ఆర్‌ఎస్‌ఐ లింగాధర్ బృందం, స్థానిక ఎఫ్‌బీఓ ఐ.జనార్దనతో కలిసి సోమవారం రాత్రి నుంచి చేజర్ల అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. మంగళవారం తెల్లవారుజామున వీరు కలువాయి ఫారెస్ట్ బీటు పరిధికి చేరుకోగా, అక్కడ కారు, బైక్‌తో కొందరు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. 192 దుంగల్లో కొన్నింటిని పలకలుగా మార్చారు. వాటిని, మరికొన్ని దుంగల్ని అడవిలో ఉంచినట్లు నిందితులు చెప్పారు. వాటిని చైన్నెకి తరలించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు.