
పేకాట శిబిరానికి వెళ్తుండగా..
కందుకూరు: పేకాట పిచ్చి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేలా చేస్తే మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన గుడ్లూరు మండలం పోట్లూరు వద్ద చోటుచేసుకుంది. క్షతగాత్రుడి బంధువుల కథనం మేరకు.. గుడ్లూరు మండలం దప్పళంపాడు గ్రామానికి చెందిన చెరుకూరి మాల్యాద్రి అనే వ్యక్తి ఆదివారం కందుకూరు కారు స్టాండ్‌లోని వాహనాన్ని సెల్ఫ్ డ్రైవింగ్ విధానంలో అద్దెకు తీసుకున్నాడు. అనంతరం అదే మండలం పరకొండపాడు గ్రామానికి చెందిన తూమాటి లక్ష్మయ్య (49)ను ఎక్కించుకుని గుడ్లూరు నుంచి తెట్టు వైపు బయలుదేరాడు. ఈ క్రమంలో కారు అర్ధరాత్రి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా చనిపోయాడు. తీవ్రగాయాలైన మాల్యాద్రిని మెరుగైన చికిత్స కోసం బంధువులు ఒంగోలు కిమ్స్‌కు తరలించారు.
అదే కారణమా?
ఈ ప్రమాదంపై పోలీసులు చెబుతున్న మాట ఒక విధంగా ఉండగా, మాల్యాద్రి బంధువులు చెప్పేది మరోలా ఉంది. మద్యం తాగి అధిక వేగంతో కారు నడపడం వల్ల చెట్టును ఢీకొన్నట్లు పోలీసులు చెబుతుంటే, పేకాట శిబిరానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు మాల్యాద్రి బంధువులు చెబుతున్నారు. అతను ఆదివారం రామాయపట్నం ప్రాంతంలో జరిగే పేకాట శిబిరానికి పేకాటరాయుళ్లను తరలించాల్సి ఉంది. ఈ ప్రాంతంలో కొంతకాలంగా జరుగుతున్న శిబిరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పేకాటరాయుళ్లను మాల్యాద్రి పికప్ చేసుకుని కారులో తీసుకెళ్లి వదిలిపెడతాడు. దీనికి నిర్వాహకులు అతడికి కారు బాడుగ ఇవ్వడంతోపాటు అదనంగా కొంత నగదును ఇస్తారు. ఈ క్రమంలోనే కందుకూరులో కారును అద్దెకు తీసుకుని వివిధ ప్రాంతాల నుంచి పేకాటరాయుళ్లను పికప్ చేసుకుని శిబిరానికి తరలించే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు. కొంత కాలంగా ఈ శిబిరం భారీ స్థాయిలో నడుస్తోందని, అనేక కుటుంబాలు నాశనమవుతున్నాయని మాల్యాద్రి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెట్టును ఢీకొన్న కారు
ఒకరి మృతి,
మరొకరికి తీవ్రగాయాలు

పేకాట శిబిరానికి వెళ్తుండగా..