
నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్
నెల్లూరు రూరల్: ఇండోసోల్ కంపెనీ కోసం ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో 8,348 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని రైతు, వ్యవసాయ, కార్మిక, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం నెల్లూరులో కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ప్రధాన జీవనాధారమైన వ్యవసాయం కంపెనీ స్థాపనతో విధ్వంసమవుతుందని తెలిపారు. ఇది ఆహార భద్రత, ప్రజల జీవనోపాధుల విధ్వంసం తప్ప మరేదీ కాదన్నారు. రైతులు, ప్రజలు గ్రామసభకు హాజరై పంట పొలాలు, నివాస స్థలాలను కంపెనీకి ఇచ్చేది లేదని ఏకగ్రీవంగా తీర్మానం చేశారని గుర్తుచేశారు. ఆ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చిన జీఓని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్, వెంగపట్నం రమణయ్య, ఆలూరు తిరుపాలు, వి.రామరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.