
పచ్చముఠా దోపిడీ
● ఇష్టారాజ్యంగా ఇసుక, గ్రావెల్,
బండరాళ్ల తరలింపు
● రాజుపాళెంలో యథేచ్ఛగా
అక్రమ రవాణా
● చోద్యం చూస్తున్న అధికారులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: వెంకటగిరి నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్, బండరాళ్లను అక్రమంగా తరలిస్తూ సహజ సంపదను పచ్చముఠా లూటీ చేస్తోంది. ఓ నేత కనుసన్నల్లో ఈ మాఫియా చెలరేగిపోతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సహజ సంపదను గుల్ల చేసి రూ.కోట్లను వెనుకేసుకుంటున్నారు. జిల్లాలోని కలువాయి మండలం రాజుపాళెం సమీపంలో గల పెన్నాలో ఇసుక తవ్వకాలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతివ్వలేదు. అయినా తమ్ముళ్లు మాత్రం ఇసుక రేవుల్లో పడి అందినంత దోచేస్తున్నారు. దీనికి తోడు పెన్నాలో నీటి ప్రవాహానికి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో అక్కడ లభించే పెద్ద రాళ్లతో పాటు గ్రావెల్‌ను సైతం నిర్భయంగా తరలించుకుపోతున్నారు.
రీచ్‌లు స్టాపైనా.. ఆగని అక్రమ రవాణా
జిల్లాలోని ఇసుక రీచ్‌లకు అక్టోబర్ 15 వరకు అనుమతులను అధికారులు రద్దు చేశారు. అయితే ఈ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ రాజుపాళెం రీచ్‌లో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. కూటమి నేతల కనుసన్నల్లో దీన్ని జరిపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిత్యం సగటున వంద వాహనాల్లో ఇసుకను ఇతర రాష్ట్రాలకు పగలూ.. రాత్రనే తేడా లేకుండా రవాణా చేస్తున్నారు. పోలీస్, రెవెన్యూ , మైనింగ్ అధికారులు ఈ అక్రమార్జనలో భాగస్వాములయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నదిలోకి రాచబాట
పర్యావరణానికి తూట్లు పొడుస్తూ పెన్నాలోకి ఇసుకాసురులు రాచబాట వేశారు. తెలుగురాయపురానికి ప్రధాన రహదారి నుంచి నది మధ్యలోకి రోడ్డేశారు. రాజుపాళెంలోని ప్రధాన రహదారి నుంచి ప్రైవేట్ వ్యక్తికి చెందిన మామిడి తోట మీదుగా నిర్మించారు. దీనికి గానూ సదరు వ్యక్తికి నెలకు రూ.50 వేలు ముట్టజెప్తున్నారు. నదీ గర్భంలోకి రోడ్డేసినా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడటంలేదు.
రీచ్‌లో పెద్ద రాళ్లను తరలిస్తూ..

పచ్చముఠా దోపిడీ