సమగ్ర సోమశిల నెరవేర్చిన జలయాజ్ఞికుడు | - | Sakshi
Sakshi News home page

సమగ్ర సోమశిల నెరవేర్చిన జలయాజ్ఞికుడు

Jul 8 2025 7:05 AM | Updated on Jul 8 2025 7:05 AM

సమగ్ర సోమశిల నెరవేర్చిన జలయాజ్ఞికుడు

సమగ్ర సోమశిల నెరవేర్చిన జలయాజ్ఞికుడు

వైఎస్సార్‌.. భవిష్యత్‌ స్వాప్నికుడు. వర్షపు నీటిని ఒడిసి పట్టి సాగుకు మళ్లించిన అపర భగీరథుడు. పుడమి తల్లిని పులకింప చేశారు. సింహపురి సిగలోని జలనిధి నుంచి గంగమ్మను ఉరకలెత్తించారు. బంజరు భూములకు జలసిరులు అందించి బంగరు భూములుగా మార్చిన జలయాజ్ఞికుడు. ఉమ్మడి జిల్లా తీరంలో మధ్య భాగంగా కృష్ణపట్నంలో పోర్టు నిర్మించి ప్రపంచ స్థాయి పటంలో నెల్లూరుకు స్థానం కల్పించిన భవిష్యత్‌ స్వాప్నికుడు. పవర్‌ ప్రాజెక్ట్‌లతో జిల్లాలో వెలుగులు నింపిన వెన్నెల రేడు. పారిశ్రామిక సెజ్‌లతో విదేశీ సంస్థలను స్థాపించి అభివృద్ధికి బీజాలు వేసిన పాలికుడు. నిరుద్యోగాన్ని రూపు మాపి లక్షల కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన వల్లభుడు. దశాబ్దన్నర కాలం గడిచినా జిల్లా అన్నదాతల మదిలో రాజన్న స్థానం పదిలం. మంగళవారం వైఎస్సార్‌ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు.

– సాక్షి ప్రతినిధి, నెల్లూరు

దాదాపు మూడు దశాబ్దాలపైకు పైగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వందల రూ.కోట్లతో ప్రాజెక్ట్‌లకు పునాదులతో జలయజ్ఞానికి శ్రీకారం చుట్టిన పాలక కర్షకుడు. 2004 ఎన్నికలకు ముందు 48 టీఎంసీలకే పరిమితమైన సోమశిల నీటి సామర్థ్యాన్ని రెండు దశల్లో 78 టీఎంసీల స్థాయికి తీసుకు వచ్చారు. సమగ్ర సోమశిలలో భాగంగా 104 కిలో మీటర్ల పొడవునా ఉత్తర కాలువను సోమశిల నుంచి ప్రకాశం జిల్లా కందుకూరు వరకు అభివృద్ధి చేసి నీటి ఔట్‌ ఫ్లో సామర్థ్యాన్ని పెంచారు.

వృథా నీటి ఒడిసి పట్టి..

వృథాగా సముద్రంలో కలుస్తున్న కృష్ణా నది వరద నీటిని శ్రీశైలం డ్యాం నుంచి కరువు ప్రాంతమైన రాయలసీమకు కేవలం 1,500 క్యూసెక్కుల తరలించేందుకు గతంలో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని అధికారికంగా 44 వేల క్యూసెక్కులని చెప్పినా వాస్తవంగా 1.10 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో రోజుకు దాదాపు 10 టీఎంసీలు తరలించే విధంగా అభివృద్ధి చేశారు. పెన్నార్‌ డెల్టాతో పాటు మెట్ట ప్రాంత భూములను సస్య శ్యామలం చేసేందుకు జలయజ్ఞం ద్వారా రూ.220 కోట్లతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.

సంగం బ్యారేజ్‌ నిర్మాణంతో..

జిల్లాలోనే కీలక ప్రాజెక్ట్‌లైన సంగం, పెన్నా బ్యారేజీలపై దృష్టి సారించి 2006 మే 28న రూ.98 కోట్ల వ్యయంతో సంగం బ్యారేజీ శంకుస్థాపన చేశారు. 800 మీటర్ల పొడవుతో దీన్ని నిర్మించి 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు డెల్టా స్థిరీకరణకు దోహదపడేలా సిద్ధం చేశారు. అయితే నిర్మాణ వ్యయం పెరగడంతో 2008లో రీ టెండర్లు నిర్వహించి ప్రాజెక్ట్‌ వ్యయాన్ని రూ.149.60 కోట్లకు పెంచి పనులు వేగవంతం చేశారు. ఆయన మరణానికి ముందు వరకు 40 శాతం పనులు పూర్తయ్యాయి. తదనంతర పాలకులు నిర్లక్ష్యం వహించడంతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై దృష్టి సారించి ప్రజలకు అంకితం చేశారు.

పెన్నా బ్యారేజ్‌తో..

2008లో పెన్నాబ్యారేజ్‌ రూ.126 కోట్ల వ్యయంతో నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. 0.55 టీఎంసీ నీటి సామర్థ్యంతో తలపెట్టిన పెన్నా బ్యారేజీ తదనంతరం రీ టెండర్ల ద్వారా రూ.149.39 కోట్లకు చేరింది. దివంగత మహానేత హయాంలో పరుగులు తీసిన అభివృద్ధి మళ్లీ ఆయన తనయుడు దృష్టి సారించి పూర్తి చేశారు. 57 గేట్లతో 637 మీటర్ల పొడవుతో 10.90 లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా బ్యారేజ్‌ని నిర్మించారు.

మహానేత దూరదృష్టి.. అభివృద్ధి సృష్టి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ దూరదృష్టితో అభివృద్ధి సృష్టించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 169 కి.మీ. పొడవైన సముద్ర తీరంలో మధ్య భాగం కృష్ణపట్నంలో పోర్టును నిర్మించారు. ఈ పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతులతో ప్రపంచ స్థాయిలో సింహపురి కీర్తిని నిలిపారు. ఈ పోర్టు ద్వారా జిల్లాలో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పనకు బీజాలు వేశారు. జిల్లాకే కాకుండా రాష్ట్ర, కేంద్ర ఖజానాలకు ఆదాయ వనరుగా మార్చారు. మరో వైపు అదే ప్రాంతంలో ప్రభుత్వ రంగంలో 2,400 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి శ్రీకారం చుట్టి.. జిల్లాలో వెలుగులు నింపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement