
ఐదు రోజుల పండగ
6వ తేదీ – షహదత్ 7వ తేదీ – గంధమహోత్సవం 8వ తేదీ – రొట్టెల పండగ 9వ తేదీ – తహలీల్ ఫాతెహా 10వ తేదీ – ముగింపు సభ
● నేటి నుంచి రొట్టెల పండగ ప్రారంభం
స్వర్ణాల చెరువులో భక్తుల సందడి
మత సామరస్యానికి ప్రతీకగా జరిగే రొట్టెల పండగ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ పండగకు సింహపురి దారులన్నీ బారాషహీద్ దర్గా వైపే మళ్లాయి. కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు, కొత్త కోర్కెల రొట్టెలు పట్టుకునేందుకు ముందు రోజే భక్తులు పోటెత్తడంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో స్వర్ణాల చెరువు భక్తజనసంద్రంగా మారింది.
బారాషహీద్ దర్గా
నెల్లూరు (బారకాసు): నెల్లూరుకు రొట్టెల పండగొచ్చింది. నగరంలోని దర్గామిట్టలో ఉన్న బారాషహీద్ దర్గాలో రొట్టెల పండగకు అవసరమైన ఏర్పాట్లన్నీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఈ రొట్టెల పండగ ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. నెల్లూరులో జరిగే రొట్టెల పండగకు ఎంతో విశిష్టత ఉంది. దేశ, విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. బారాషహీద్‌లను స్మరిస్తూ కోర్కెలు తీరాలని స్వర్ణాల చెరువులో ఒకరికొకరు రొట్టెలను మార్చుకుంటారు. ఆ కోర్కెలు తీరిన తర్వాత మళ్లీ వచ్చి రొట్టెను వదులుతారు. మరో కోర్కె రొట్టెను తీసుకెళ్తుంటారు. దర్గా ప్రాంగణంలో విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి.
స్వర్ణాల చెరువులో భక్తుల సందడి
రొట్టెల మార్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో సందడి నెలకొంది. పండగ ప్రారంభానికి ముందే భక్తుల రాకతో బారాషహీద్ దర్గా ప్రాంగణం కిటకిటలాడుతోంది. శనివారం ఉదయం నుంచి స్వర్ణాల చెరువు వద్ద కోర్కెల రొట్టెలను మార్చు కున్నారు. రెండు రోజుల ముందు నుంచే వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు బారాషహీద్ దర్గాకు చేరుకుంటున్నారు. నగర పాలక సంస్థ, పోలీసు, విద్యుత్, ఆరోగ్య, రెవెన్యూ శాఖలతోపాటు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశారు.
భక్తులకు సౌకర్యాల కల్పన
జాతీయ రహదారి నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గంలో బారాషహీద్ దర్గాకు రూట్ మ్యాప్ సూచిస్తూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తాగునీటి కేంద్రాలు, స్నానపు గదులు, మరుగుదొడ్లు మహిళలు, పురుషులకు వేర్వేరుగా నిర్మించారు. భక్తులకు అందుబాటులో 108 వాహనాలు, ఆరోగ్య కేంద్రాలు కల్పించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా షామియానాలు, పందిళ్లపైనా భారీ జింక్ షీట్‌లు ఏర్పాటు చేశారు. స్వర్ణాల చెరువు వద్ద భక్తులు ప్రమాదాలకు గురికాకుండా కంచెను ఏర్పాటు చేశారు. చెరువు వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. చెరువులో నీరు మురుగు చేరకుండా ఎప్పటికప్పుడు మోటార్లతో శుద్ధి చేస్తున్నారు. దర్గా ఆవరణలో చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులు, జైంట్‌వీల్స్ ఏర్పాటు చేశారు.
అధికారుల సమన్వయంతో
నగర పాలక సంస్థ, విద్యుత్, పోలీస్, వైద్య శాఖలతోపాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్, ఎస్పీ, కార్పొరేషన్ కమిషనర్ ఇతర శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి సిబ్బందికి రొట్టెల పండగ నిర్వహణపై సూచనలు చేశారు.
వేలాది మంది భక్తుల హాజరు
దర్గాకు శనివారం వేలాది మంది భక్తులు హాజరయ్యారు. కోర్కెల రొట్టెలను మార్చుకుని భక్తి శ్రద్ధలతో దర్గాను సందర్శించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఆంధ్రరాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు అధికంగా హాజరయ్యారు. రొట్టెల పండగకు ముందుగానే భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.
కళకళలాడుతున్న దర్గా ప్రాంగణం
బారాషహీద్ దర్గాకు
పోటెత్తుతున్న భక్తులు
స్వర్ణాల చెరువులో కొర్కెల రొట్టెల మార్పిడి సందడి
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. క్షేత్రస్థాయిలో నిత్యం పరిశీలిస్తూ సిబ్బందికి తగు సూచనలు చేస్తున్నాం. బారాషహీద్ దర్గా ప్రాంగణ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 24గంటలు పాటు పోలీసు నిఘా ఉంటుంది. అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాం.
– ఆనంద్, కలెక్టర్.

ఐదు రోజుల పండగ

ఐదు రోజుల పండగ

ఐదు రోజుల పండగ

ఐదు రోజుల పండగ