చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
వెంకటాచలం: చంద్రబాబు పాలనలో వైఎస్సార్‌సీపీ కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులను బనాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి విమర్శించారు. కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసుల కారణంగా వెంకటాచలం మండలం చెముడుగుంటలోని జిల్లా సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఎమ్మెల్సీ మేరిగ మురళి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి ములాఖత్ ద్వారా సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం నారాయణస్వామి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఏడాది పాలనంతా అభివృద్ధిని విస్మరించి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చుట్టూ ఉన్నవారిపై కేసులు పెట్టి, వేధించడంతోనే సరిపోయిందన్నారు. ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా, నియంతృత్వ పోకడలతో పాలన సాగించడం సరైన పద్ధతి కాదన్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై రోజుకొక కొత్త కేసు పెడుతుండడం దారుణమన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలు పొందకుండా వైఎస్సార్‌సీపీ నేతలను వేధింపులకు గురిచేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి నాయ కులు వైఎస్సార్‌సీపీని భూస్థాపితం చేస్తామని చెబుతున్నారని, కానీ భవిష్యత్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడం ఖాయమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడకు వెళ్లినా ప్రజాదరణ తగ్గలేదని చెప్పారు. ఆయనకు వస్తున్న జనాదరణ చూసి కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతుందన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందనే విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుచుకోవాలన్నారు.
కాకాణిపై
రోజుకొక కేసు పెట్టడం దారుణం
మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి


