డీఈఓ కార్యాలయ ముట్టడి వాయిదా | - | Sakshi
Sakshi News home page

డీఈఓ కార్యాలయ ముట్టడి వాయిదా

May 20 2025 11:53 PM | Updated on May 20 2025 11:53 PM

డీఈఓ కార్యాలయ ముట్టడి వాయిదా

డీఈఓ కార్యాలయ ముట్టడి వాయిదా

నెల్లూరు (టౌన్‌): రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు, సర్దుబాటుకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికతో జరిపిన చర్చల దరిమిలా బుధవారం తలపెట్టిన డీఈఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆ వేదిక స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు సురేంద్రరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్జీటీలకు మాన్యువల్‌ పద్ధతిలో కౌన్సెలింగ్‌, ఉన్నత పాఠశాలల్లో 49 రోల్‌ దాటితే రెండో సెక్షన్‌ ఏర్పాటు, ఫౌండేషన్‌ పాఠశాలల్లో 20 మంది దాటితే రెండో టీచర్‌ను ఇవ్వడం, ఖాళీలను బ్లాక్‌ చేయకుండా అన్నీ ప్రదర్శించడం, పీఎస్‌హెచ్‌ఎం పదోన్నతులు కల్పించడం, ఎంఈఓలకు బదిలీలు తదితర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసినట్లు చెప్పారు.

కామాక్షితాయికి

పురుషామృగ సేవ

బుచ్చిరెడ్డిపాళెం రూరల్‌: మండలంలోని జొన్నవాడలోని మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి, అమ్మవారు పురుషామృగ వాహనంపై విహరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏర్పాట్లు ఈఓ శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు.

డీసీపల్లిలో 473

పొగాకు బేళ్ల విక్రయం

మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో మంగళవారం 473 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి జీ రాజశేఖర్‌ తెలిపారు. వేలానికి 544 బేళ్లు రాగా 473 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 62245.1 కిలోల పొగాకు విక్రయించగా రూ.1,59,84,237.10 వ్యాపారం జరిగింది. కిలోకు గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.200 లభించగా, సగటు ధర రూ.256.80 లభించింది. వేలంలో 9 కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.

ఐ సెట్‌లో

బాలురదే హవా

నెల్లూరు (టౌన్‌): ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఐసెట్‌) ఫలితాల్లో బాలురు హవా ప్రదర్శించారు. ఈ నెల 7న ఐసెట్‌ జరిగింది. ఈ పరీక్షకు 774 మంది బాలురు హాజరు కాగా 725 మంది ఉత్తీర్ణతతో 93.65 శాతం అర్హత సాధించారు. బాలికలు 952 మందికి 909 మంది ఉత్తీర్ణులు కాగా, 95.48 శాతం అర్హత సాధించారు.

పంచాయతీ

కార్యదర్శుల సస్పెన్షన్‌

నెల్లూరు (పొగతోట): కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ కార్యదర్శి వి.హజరత్‌బాబు, సైదాపురం పంచాయతీ పూర్వ కార్యదర్శి షేక్‌ యస్దానిబాషాను సస్పెండ్‌ చేస్తూ మంగళవారం పంచాయతీరాజ్‌ కమిషనర్‌ వీఆర్‌ కృష్ణతేజ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డీపీఓ కార్యాలయానికి ఆ ఉత్తర్వులు అందాయి. పడుగుపాడు పంచాయతీ కార్యదర్శి హజరత్‌బాబు రూ.25,51,910 నిధులను ఎటువంటి బిల్లులు లేకుండా దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ కావడంతో విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. సైదాపురం పంచాయతీ పూర్వ కార్యదర్శి షేక్‌ యస్దానిబాషా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి రూ.20,33,646 నిధులను డైరెక్ట్‌గా తన పేరుపై డ్రా చేసుకుని సొంతానికి వాడుకున్నట్లు సమాచారం. ఈ నిధులను కాంట్రాక్టర్ల పేరుతో డ్రా చేయాల్సి ఉండగా కార్యదర్శి నేరుగా డ్రా చేసుకోవడంతో అతనిపై వేటు పడింది. గతంలో నిధులు పక్కదారి పట్టాయంటూ ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఆ మేరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సమగ్ర విచారణ చేసి పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు నివేదిక పంపడంతో అతనిపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం యస్దానిబాషా విడవలూరు మండలంలో పంచాయతీ కార్యదర్శిగా విధులను నిర్వర్తిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement