
కూటమి ప్రభుత్వ తీరుపై బ్రాహ్మణాగ్రహం
నెల్లూరు (బృందావనం): ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 68వ వర్ధంతిని విస్మరించిన కూటమి ప్రభుత్వం, అధికార యంత్రాంగం తీరుపై ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర, జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి నేతలు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలోని మద్రాస్ బస్టాండ్ వద్ద ఏసీ మార్కెట్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహం స్థూపంపై చెత్తాచెదారం కూడా తొలగించకుండా అవమానించారంటూ జిల్లా, నగరపాలక సంస్థ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. విగ్రహం, పరిసరాల వద్ద పడి ఉన్న చెత్తాచెదారం, మద్యం సీసాలు తొలగించి శుభ్రం చేశారు. అనంతరం ఆయన విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం విగ్రహానికి శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. నల్లబ్యాడ్జీలను ధరించి, ప్రకాశం పంతులు విగ్రహం మెడలోనూ నల్ల రిబ్బన్ మాలవేసి ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర నేతలు, జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుడ్లదొన వాసుదేవరావు, ఇసుకపల్లి కామేశ్వరప్రసాద్ తదితరులు మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో సైమన్ కమిషన్ గో బ్యాక్ అంటూ నినదించి బ్రిటిష్ వారిని ఎదిరించి ఆంగ్లేయుల తుపాకీకి గుండె ఎదురొడ్డి వెన్ను చూపని ధీరోదాత్తుడు, దేశం, రాష్ట్రం కోసం సర్వం త్యాగం చేసిన ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు జయంతి, వర్ధంతిని అధికారికంగా, ప్రభుత్వ పండగగా నిర్వహించాలని గతంలో సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. అయితే ఆయన పాలనలోనే వర్ధంతిని నిర్వహించకపోవడం శోచనీయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహించారని గుర్తు చేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సమితి కోశాధికారి దుద్దుకూరి రమేష్, మహిళా విభాగం అధ్యక్ష, కార్యదర్శులు ఐ.జయలక్ష్మి, ఉమాదేవి, మద్దూలపల్లి శ్రీధర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రకేసరి వర్ధంతిని
విస్మరించడంపై అసహనం
నల్లబ్యాడ్జీలతో నిరసన, ప్రకాశం
పంతులు మెడలో నల్లరిబ్బన్ మాల
బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో
క్షీరాభిషేకం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఘనంగా నిర్వహించారని ప్రశంసలు

కూటమి ప్రభుత్వ తీరుపై బ్రాహ్మణాగ్రహం