మినీ మహానాడుకు వెళ్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

మినీ మహానాడుకు వెళ్తుండగా..

May 19 2025 11:52 PM | Updated on May 19 2025 11:52 PM

మినీ మహానాడుకు వెళ్తుండగా..

మినీ మహానాడుకు వెళ్తుండగా..

విద్యుదాఘాతానికి గురై యువకుడి మృతి

తండ్రి కళ్లెదుటే ఘటన

వింజమూరు(ఉదయగిరి): ఆ యువకుడు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో సెలవులని ఇంటికొచ్చాడు. వింజమూరులో జరుగుతున్న టీడీపీ మినీ మహానాడుకు తండ్రితో కలిసి బయలుదేరాడు. మార్గమధ్యలో సరుకుల కొనుగోలుకు ఓ దుకాణం వద్దకు వెళ్లి విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు.. దుత్తలూరు మండలం భైరవరం గ్రామానికి చెందిన భోగిరెడ్డి ఓబులరెడ్డి, రమణమ్మ రెండో కుమారుడు చిన ఓబులరెడ్డి (23) తిరుపతిలోని ఓ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్నాడు. నేవీ ఉద్యోగం కోసం ఇటీవల జరిగిన ఫిజికల్‌ టెస్ట్‌లో పాస్‌ అయ్యాడు. బుధవారం పరీక్ష రాయాల్సి ఉంది. ఆదివారం సెలవు కావడంతో స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం వింజమూరులో టీడీపీ మినీ మహానాడుకు తండ్రితోపాటు బయలుదేరాడు. దారిలో సరుకుల కొనుగోలు కోసం వింజమూరు బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న ఓ దుకాణం వద్ద ఆగారు. దుకాణం రేకులకు ఆధారంగా వేసి ఉన్న ఇనుప స్తంభానికి అప్పటికే విద్యుత్‌ సరఫరా అవుతోంది. ఇది తెలియక చిన ఓబులరెడ్డి సంభాన్ని పట్టుకోగా షాక్‌కు గురై స్పృహ కోల్పోయాడు. వెంటనే అక్కడ ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్‌ ధ్రువీకరించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ వైద్యశాలకు వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ట్రాన్స్‌కో ఏఈ నాగూర్‌వలీ మాట్లాడుతూ షాపు ఓనర్‌ నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యజమాని నిర్లక్ష్యమే కారణమా?

నాలుగు నెలల నుంచి వర్షం వచ్చిన ప్రతిసారి దుకాణం వద్ద ఉన్న రేకులకు సపోర్టుగా ఉన్న ఇనుప స్తంభానికి విద్యుత్‌ సరఫరా అవుతోంది. ఈ విషయం అక్కడ పనిచేసే కూలీలు యజమానికి పలుమార్లు తెలిపినా పట్టించుకోలేదని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement