
గ్రహణం పట్టిస్తారా? పోస్టింగ్ ఇస్తారా?
మెగా డీఎస్సీ పోస్టింగ్‌లపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తొలి సంతకంతో ఔత్సాహిక ఉపాధ్యాయుల్లో ఆశలు రేకెత్తించిన టీడీపీ ప్రభుత్వం ఏడాది కాలంగా కాలయాపన చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాక అర్హతలపై అనేక కొర్రీలు పెట్టారు. తాజాగా పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ చేపట్టి మిగులు ఉపాధ్యాయుల లెక్కలు తేల్చారు. వీరినే కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో డీఎస్సీలో కొత్తగా వచ్చే ఉపాధ్యాయులకు ఎక్కడ పోస్టింగ్‌లు ఇస్తారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 2025 డీఎస్సీ.. 1998 నాటి డీఎస్సీ మాదిరిగా గ్రహణం పట్టే పరిస్థితులు ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
●
● ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 673 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్
● తాజాగా పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణలో
700కు పైగా మిగులు ఉపాధ్యాయులు
● 673 పోస్టులకు 28,772 దరఖాస్తులు
● ఒక్కో పోస్టుకు 43 మంది అభ్యర్థులు పోటీ
● వచ్చే నెల 6వ తేదీ నుంచి డీఎస్సీ పరీక్షలు
నెల్లూరు (టౌన్): ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలనుకునే నిరుద్యోగుల ఆశలు.. అడియాశలుగానే మిగిలిపోయే పరిణామాలు కనిపిస్తున్నాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా అప్పులు చేసి కోచింగ్‌లు తీసుకుని, ఏళ్ల తరబడి ఎదురు చూసిన ఔత్సాహిక ఉపాధ్యాయుల కలలు కల్లలు అవుతాయనే ఆందోళన డీఎస్సీకి సిద్ధమవుతున్న వారిలో కనిపిస్తోంది. ప్రభుత్వ తీరు, పరిస్థితులు చూస్తుంటే అసలు పోస్టింగ్‌లు వస్తాయా? వచ్చినా ఎప్పుడొస్తాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తుంటే.. పోస్టింగ్‌లపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
మెగా కాదు.. మినీ డీఎస్సీ
మెగా డీఎస్సీ అంటే ఎక్కువ పోస్టులు ఉంటాయని ఎదురు చూసిన నిరుద్యోగుల ఆశలపై ఆదిలో కూటమి ప్రభుత్వం నీళ్లు కొట్టింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు కేవలం 673 పోస్టులను మాత్రమే కేటాయించింది. అందులోనూ ఎస్జీటీ పోస్టులు కేవలం 117 మాత్రమే ఉన్నాయి. సాధారణంగా ఎస్జీటీ పోస్టులకు ఎక్కువ మంది పోటీ పడతారు. ఈ పోస్టుల సంఖ్య రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే నెల్లూరు జిల్లాకు బాగా తక్కువనే చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే ఇది మెగా డీఎస్సీ కాదు..మినీ డీఎస్సీ అని సష్టమవుతోంది.
673 పోస్టులకు
28,772
దరఖాస్తులు