
కాలువలో పడి వృద్ధుడి మృతి
సంగం: ఓ వృద్ధుడు కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ వద్దకు బహిర్బూమికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని అన్నారెడ్డిపాళేనికి చెందిన కిలారి రామానాయుడు (80) కొన్నేళ్లపాటు ఆత్మకూరు మండలం అప్పారావుపాళెంలో నివాసం ఉన్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. మూడు నెలలుగా మండల కేంద్రమైన సంగం పంచాయతీ మజరా అమరపునాయుడు కండ్రికలోని ల్యాంకో ఫౌండేషన్ ఆశ్రమంలో ఉంటున్నాడు. సోమవారం ఆశ్రమం బయటకు వచ్చిన రామానాయుడు సమీపంలో ఉన్న కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ వద్దకు బహిర్బూమికి వెళ్లాడు. ఈ క్రమంలో నీటిలో మునిగిపోయాడు. ఆశ్రమానికి వృద్ధుడు తిరిగి రాకపోవడంతో నిర్వాహకులు కాలువ వద్ద చూశారు. రామానాయుడు చేతి కర్ర కనిపించింది. దీంతో సంగం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై రాజేష్ కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా కాలువలో రామానాయుడు మృతదేహం కనిపించింది. దానిని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరుకు తరలించారు.
ఆగని కోళ్ల వ్యర్థాల తరలింపు
● నాలుగు మినీ లారీల పట్టివేత
సంగం: మండలంలో పలుచోట్ల సోమవారం నాలుగు మినీలారీల్లో తరలిస్తున్న 45 డ్రమ్ముల కోళ్ల వ్యర్థాలను గ్రామీణుల సహాయంతో పోలీసులు పట్టుకున్నారు. వారి కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం నుంచి సంగంకు మినీలారీలు వచ్చాయి. దువ్వూరులో రెండు, సంగం కావలి కాలువ వద్ద ఒకటి, బ్యారేజ్ వద్ద మరొకటి చికెన్ వ్యర్థాలను తరలించేందుకు వెళ్తుండగా ఆయా గ్రామాల్లోని యువకులు అడ్డగించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కొండమలుపు సమీపంలోని పంపింగ్ స్కీం వద్ద భారీ గోతిని తీసి కోళ్ల వ్యర్థాలను పూడ్చివేశారు. లారీ డ్రైవర్, యజమాని, అక్రమంగా వ్యర్థాలను తరలిస్తున్న వ్యాపారస్తులపై కేసు నమోదు చేశారు.

కాలువలో పడి వృద్ధుడి మృతి