
జాతీయ రహదారిపై వాహనాల బీభత్సం
దగదర్తి : మండలంలోని అల్లూరు రోడ్డు రైల్వే వంతెన వద్ద సోమవారం తెల్లవారుజామున మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో బీభత్సంగా మారింది. అయితే ఆయా వాహనాల డ్రైవర్లు, ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. వివరాల్లోకి వెళ్తే.. అల్లూరు రోడ్డు వద్ద రైల్వే వంతెన ప్రాంతంలో గతం నుంచి రెండు లేన్ల జాతీయ రహదారి ఉంది. అయితే రహదారి విస్తరణలో కొత్తగా మరో రెండు లేన్లను కొత్తగా నిర్మించారు. ప్రస్తుతం అక్కడ నాలుగులేన్ల జాతీయ రహదారి ఉంది. అయితే పాత రెండు లేన్ల రహదారి (నెల్లూరు నుంచి కావలి వైపు వెళ్లే దారి)లో వంతెన బలహీనంగా ఉందని 12 ఏళ్ల క్రితమే ఆ మార్గాన్ని మూసివేశారు. కొత్తగా నిర్మించిన రెండు లేన్ల రహదారినే ఇరువైపుల వాహనాల రాకపోకలను కొనసాగిస్తున్నారు. ఈ వంతెనకు అటు, ఇటు నుంచి ఆరు లేన్ల రహదారి ఉంది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనచోదకులకు అక్కడికి వచ్చే వరకు రహదారి సింగిల్ లేన్ ఉన్న విషయం తెలియదు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున అతివేగంగా వచ్చిన ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. అదే సమయంలో వెనుకనే వేగంగా వస్తున్న ఓ కారు, దాని వెనుకనే వస్తున్న భారీ ట్రాలీ ఢీకొనడంతో బీభత్సంగా మారింది. అయితే ఈ ప్రమాదంలో ఆయా వాహనాల్లోని డ్రైవర్లు, ప్రయాణికులకు స్వల్పగాయాలు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదాల కారణంగా ఈ మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైవే సిబ్బందితోపాటు పోలీసులు అక్కడికి చేరుకుని క్రేన్ల సహాయంలో బోల్తాపడిన వాహనాన్ని పక్కకి తప్పించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.
అదుపు తప్పి బోల్తాపడిన లారీ
వెనుకనే వస్తూ ఢీకొన్న కారు, భారీ ట్రాలీ
స్వల్పగాయాలతో బయటపడిన డ్రైవర్లు, ప్రయాణికులు

జాతీయ రహదారిపై వాహనాల బీభత్సం