
లీజు గడువు తీరిన మైన్లు స్వాధీనం చేసుకోవాలి
● రాష్ట్ర సంగీత అకాడమీ
మాజీ చైర్‌పర్సన్ పొట్టేళ్ల శీరిషా
నెల్లూరు రూరల్: సైదాపురం మండలంలో 50 ఏళ్ల లీజు గడువు ముగిసిన మైకా గనులు 8 ఉన్నాయని, వాటిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జెడ్పీ మాజీ వైస్ చైర్‌పర్సన్, రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్‌పర్సన్ పొట్టేళ్ల శీరిషా డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత ప్రభుత్వ గనుల శాఖ ఈ కార్ట్ ్జను మేజర్ మినరల్స్ కింద కేటాయించిందన్నారు. ఎంఎండీఆర్ చట్టం 1957 ప్రకారం అక్రమ మైనింగ్ చేయకూడదన్నారు. అయితే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అతని అనుచరుడు యథేచ్ఛగా అక్రమ మైనింగ్ చేస్తున్నారన్నారు. పర్యావరణ క్లియరెన్స్ లేకుండా ఎటువంటి మైనింగ్ చేపట్టకూడదని సుప్రీంకోర్టు 2017లో 114 పేజీలతో జస్టిస్ దీపక్ గుప్తా ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చిందని గుర్తు చేశారు. బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉండి సుప్రీం ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమ మైనింగ్ చేస్తుంటే ఇంతకన్నా దారుణం ఎక్కడ ఉండదన్నారు. ఈ అక్రమ మైనింగ్‌పై జిల్లా మైనింగ్ డీడీ బాలాజీనాయక్‌కు ఫిర్యాదు చేసినా, బ్లాస్టింగ్ చేసి అక్రమ మైనింగ్ చేస్తుంటే సంబంధం లేనట్లు డీడీ వ్యవహరించడం తగదన్నారు. ఐబీఎం రూల్స్‌ను అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును లెక్క చేయకుండా ఈ మాఫియా బరి తెగించి యథేచ్ఛగా అక్రమ మైనింగ్ చేస్తుందన్నారు. తక్షణమే లీజు గడువు ముగిసిన ఈ గనులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌ను కోరామన్నారు. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎంఎండీఆర్ చట్టం 1957 ప్రకారం సిద్ధి వినాయక, కేఎస్‌ఆర్ అండ్ కంపెనీ, శోభరాణి, భరత్‌బాబు, వీకేడీఎం కనకదుర్గ, జయలక్ష్మి మీనాక్షి సుందరం, రుస్తుం, మైకా మైన్స్‌లను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.