
ప్రతిష్టాత్మకంగా ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు (బారకాసు): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల మూడో శనివారం చేపడుతున్న స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పర్యావరణ సంరక్షణ కోసం మొక్కల పెంపకం ఆవశ్యకతను గుర్తించాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని డివిజన్ల పరిధిలో శనివారం ‘బీట్ ది హీట్’ అంశంపై పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా మొక్కలను నాటి సంరక్షించే చర్యలను చేపట్టారు. స్థానిక 27వ డివిజన్ రిత్విక్ ఎన్ క్లేవ్ పార్కులో కలెక్టర్ ఆనంద్, కమిషనర్ నందన్, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తమ మాతృమూర్తుల పేరిట మొక్కలను నాటారు. అనంతరం కలెక్టర్ అందరితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క రూ మొక్కలను విరివిగా నాటి సంరక్షించాలని సూచించారు. స్వయం సహాయక బృందాలు పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ హితమైన వస్తువుల ఉత్పత్తి, వినియోగంపై మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మహిళలందరూ గృహాలపైన చిన్నచిన్న మొక్కలతో రూఫ్ టాప్ గార్డెన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. నగర వ్యాప్తంగా పచ్చదనాన్ని పరిరక్షించేందుకు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోని 64 పార్కుల్లో వాకర్స్ అసోసియేషన్ భాగస్వామ్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ చేపడుతున్నామని కమిషనర్ నందన్ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మురహరి, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్‌ఈ రామ్మోహన్‌రావు, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చైతన్య, టౌన్ ప్లానింగ్ సీపీ హిమబిందు, ఉద్యాన శాఖ ఏడీ ప్రదీప్‌కుమార్, స్థానిక పర్యావరణవేత్త షేక్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.