
రాబోయేది జగనన్న ప్రభుత్వమే
● మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి
కోవూరు: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో జగనన్న ప్రభుత్వం కొలువుదీరడం ఖాయమని మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో పార్టీ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. పహల్గామ్‌లో పర్యాటకులను పొట్టనబెట్టుకున్న పాకిస్థాన్ ఉగ్రవాదులపై మన దేశ ఆర్మీ దాడులు జరిపి వారిని మట్టుబెట్టిందని చెప్పారు. ఉగ్రదాడుల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు ప్రభుత్వాలు రూ.ఐదు కోట్లనైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసువులుబాసిన సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్‌కు రూ.25 లక్షలను తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన అంశాన్ని గుర్తుచేశారు. ప్రపంచంలో పాకిస్థాన్ అనేదే లేకుండా చేయగల సత్తా మనకు ఉందని చెప్పారు. దేశానికి ప్రధానిగా మోదీ.. రాష్ట్రానికి సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి 20 ఏళ్లు ఉండాలని కాంక్షించారు. డీసీఎమ్మెస్ చైర్మన్ వీరి చలపతి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, జొన్నవాడ దేవస్థాన చైర్మన్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, మండల ఉపాధ్యక్షుడు నరసింహులురెడ్డి, మండల కన్వీనర్లు అనూప్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, షాహుల్, నవీన్‌కుమార్‌రెడ్డి, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు .