
అదుపులో ఉంచాలంటే..
● ఒత్తిడితో కూడిన జీవనం,
విశ్రాంతి లేమి కారణాలు
● జిల్లాలో 5 లక్షల మంది వరకు రోగులు
● అవగాహన, మంచి ఆహార
అలవాట్లతో చెక్
నేడు వరల్డ్ హైపర్‌టెన్షన్ డే
నెల్లూరు(అర్బన్): బీపీ (అధిక రక్తపోటు).. తీవ్ర ఒత్తిడితో కూడిన జీవన విధానం, నిద్రలేమి, జంక్ ఫుడ్, జన్యుపరమైన కారణాలతో ఇది వస్తుంది. ప్రస్తుతం అనేకమంది దీని వల్ల బాధపడుతున్నారు. వైద్యపరిభాషలో హైపర్‌టెన్షన్‌గా పిలిచే ఈ జబ్బును నిర్లక్ష్యం చేస్తే రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదం ఉంది. గుండెపోటు రావొచ్చు. బీపీని నియంత్రణలో ఉంచుకోకుంటే ప్రాణాంతకంగా మారుతుంది. అనేకమందికి బీపీ ఉన్న విషయం కూడా తెలియదు. ఈలోపు ఎక్కువై ఒక్కో దఫా ప్రాణాల మీదకు వస్తుంది. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తుంటారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం మేనెల 17వ తేదీని వరల్డ్ హైపర్‌టెన్షన్ డేగా ప్రకటించింది. అందులో భాగంగా శనివారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో బీపీపై అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించనున్నారు.
సంఖ్య పెరుగుతూ..
జిల్లాలో బీపీ రోగుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. ఒకప్పుడు 5 శాతంగా ఉంటే నేడు సుమారు 20 శాతానికి చేరింది. వైద్యారోగ్య శాఖ 2023లో పీహెచ్‌సీల పరిధిలో సర్వే చేపట్టి స్క్రీనింగ్ చేయగా 1,01,172 మంది బీపీ బారిన పడినట్టు తేలింది. 2024లో స్క్రీనింగ్ చేయగా 80 వేల మంది ఉన్నట్లు వైద్యశాఖ లెక్క చెప్పింది. సాధారణంగా రోగులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. అయితే అధికారులు తగ్గినట్టు చూపడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్, కందుకూరు, కావలి ఏరియా హాస్పిటళ్లు, ఆత్మకూరు జిల్లా ఆస్పత్రితోపాటు 10 సీహెచ్‌సీల పరిధిలో మరో 4 లక్షల మందిపై వరకు బీపీ రోగులు వస్తున్నారు. అంటే జిల్లా జనాభాలో సుమారు 20 శాతం రక్తపోటుతో బాధపడుతున్నారు.
కారణాలెన్నో..
ప్రస్తుతం అనేకమందిది ఉరుకులు, పరుగుల జీవితం. వ్యాపారస్తులు, ఉద్యోగులు, మార్కెటింగ్ చేసే వారు, ప్రైవేట్ ఉద్యోగులు టార్గెట్‌లు చేరుకోవడానికి పనిఒత్తిడితోనే విధులు నిర్వర్తించాల్సి ఉంది. సరైన నిద్ర లేకపోయినా కూడా ఆ ప్రభావం శరీరంపై పడుతోంది. అధిక ఉప్పు, తగిన శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం వంటి సమస్యలు బీపీకి కారణంగా ఉన్నాయి. అధిక ఉప్పుతో కూడిన ఆహారం వల్ల కూడా రక్తపోటు బారిన పడుతున్నారు.
లక్షణాలను గుర్తించాలి
అధికంగా బీపీ ఉన్నవారికి తలతిరిగినట్టు ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఒక్కోదఫా వాంతులు, తల తిరిగిపోవడం, అలసట, వికారం లాంటి లక్షణాలుంటాయి. బీపీ ఎక్కువైతే కంటిలోని రెటీనాకు రక్త సరఫరా తగ్గి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఛాతిలో నొప్పి వచ్చి గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. రక్తపోటు ఎక్కువగా ఉండేవారికి గురక అధికంగా ఉంటుంది. రాత్రి వేళ తరచూ తలనొప్పి వస్తుంది. కొంతమందిలో ముక్కు నుంచి రక్తం కారుతుంది.
అధిక బరువు లేకుండా చూసుకోవాలి. ఆహారంలో రోజుకు 5 గ్రాముల ఉప్పు కన్నా ఎక్కువ తీసుకోరాదు. గుట్కా, మద్యం, సిగరెట్, బీడీ, చుట్ట అలవాట్లు మానుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. 30 ఏళ్ల వయసు నిండిన వారు క్రమం తప్పకుండా బీపీని చెక్ చేయించుకోవాలి. రక్తపోటును నియంత్రణలో ఉంచుకోని వారిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. మెదడులో రక్తనాళాలు చిట్లుతాయి. పక్షవాతం బారిన పడొచ్చు. కిడ్నీలు దెబ్బతింటాయి. లివర్ పాడవుతుంది. మెదడుపై బీపీ ప్రభావం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది.
అవగాహన పెంచుకోవాలి
అధిక రక్తపోటు గురించి ప్రజలు అవగాహన పెంచుకుని తగిన జాగ్రత్తలు పాటించాలి. బీపీని నియంత్రణలో ఉంచుకుంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులుండవు. సక్రమంగా మందులు వాడకపోయినా ప్రమాదమే. యోగా, వ్యాయామం లాంటివి చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా పలు రకాల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. బీపీ ఉన్న వారు ప్రతినెలా చెక్ చేయించుకోవాలి.
– డాక్టర్ ఎంవీ రమణయ్య,
రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల

అదుపులో ఉంచాలంటే..

అదుపులో ఉంచాలంటే..