
అయ్యా.. నా బిడ్డను కాపాడండి
కలువాయి(సైదాపురం): ‘పొట్టకూటి కోసం నా బిడ్డ సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ యజమాని చిత్రహింసలకు గురిచేస్తూ నా బిడ్డను చంపే ప్రయత్నం చేస్తున్నాడయ్యా. కనికరించి మావాడిని మన దేశానికి రప్పించండి’ అంటూ షేక్ కాలేషా అనే వ్యక్తి కోరాడు. అతడి కథనం మేరకు.. కలువాయి మండలంలోని కుల్లూరు గ్రామానికి చెందిన షేక్ కాలేషా, బీబీ దంపతులకు షేక్ నజీర్ అనే కుమారుడున్నాడు. అతను 7వ తరగతి వరకు చదివి ఇక్కడే కూలీ పనులు చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. 2024 డిసెంబర్ నెలలో ఓ ఏజెంట్ మాటలు విని రూ.2 లక్షలు పెట్టి నజీర్‌ను సౌదీకి పంపారు. అక్కడ యజమాని పెట్టే చిత్రహింసలు భరించలేక నజీర్ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. ఓరోజు యజమాని చెట్టు కొమ్మలను నరికే పనిని అప్పగించాడు. నజీర్ చెట్టుపై నుంచి పడి గాయపడ్డాడు. కాగా మూడునెలలపాటు పని చేయించుకుని జీతం అడిగితే యజమాని చిత్రహింసలకు గురిచేయడంతోపాటు దాడి చేశాడు. తన బిడ్డను ఎలాగైనా ఇండియాకు రప్పించి ఆదుకోవాలంటూ గురువారం కాలేషా కలువాయి తహసీల్దార్ శ్యాంసుందర్‌కు విన్నవించాడు. తనను కలిస్తే ఏం జరుగుతుంది. ఎమ్మెల్యే లేదా, కలెక్టర్‌ను న్యాయం జరుగుతుందంటూ తహసీల్దార్ బాధితుడికి తెలియజేయడంతో వెనుదిరిగాడు. ఉన్నతాధికారులను కలుస్తానంటూ కాలేషా మీడియో ముందు కన్నీరుమున్నీరుగా విలపించాడు.
సౌదీ అరేబియా నుంచి
రప్పించండి
తహసీల్దార్‌కు ఓ తండ్రి విన్నపం