
ఆటోలో నుంచి జారిపడి..
● ఒకరి మృతి
కావలి(జలదంకి): కావలి రూరల్ మండలం కొత్తసత్రం గ్రామానికి చెందిన డోకి రవికుమార్ (36) అనే వ్యక్తి ఆటోలో నుంచి జారిపడి మృతిచెందిన ఘటన గురువారం జరిగింది. కావలి రూరల్ పోలీసుల కథనం మేరకు.. కొత్తసత్రానికి చెందిన రవికుమార్ ఆకుకూరలు పండించి కావలిలో అమ్ముకుంటూ జీవనం సాగిస్తాడు. గురువారం అతను గ్రామానికి చెందిన అరగల పొట్టయ్య ఆటోలో కావలికి వస్తుండగా మార్గమధ్యలో జారి రోడ్డుపై పడ్డాడు. స్థానికులు చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. రవికుమార్‌కు భార్య చంద్రకళ, ఇద్దరు పిల్లలున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.