లోపాలు సరి చేస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

లోపాలు సరి చేస్తున్నాం

May 16 2025 12:08 AM | Updated on May 16 2025 12:08 AM

లోపాల

లోపాలు సరి చేస్తున్నాం

ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి,

మెడికల్‌ కళాశాలలో ఇదీ పరిస్థితి

శానిటరీ వర్కర్స్‌ జీతాల్లో కోత

కొత్తవారిని తీసుకోవాలంటే లంచాలు

పక్కదారి పడుతున్న వేతనాల సొమ్ము

పని మానేసిన వారి పేరుతోనూ జీతాలు

అధికారులు, రాజకీయ నేతలకు వాటాలు

ఆస్పత్రిలో రూ.30 వేల జీతంతో పని చేస్తున్నట్టు ఇచ్చిన ఫేక్‌ శాలరీ సర్టిఫికెట్‌

నెల్లూరు(అర్బన్‌): ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఏసీఎస్‌ఆర్‌ మెడికల్‌ కళాశాలలో మెరుగైన పారిశుద్ధ్యం కోసం ఒక ఏజెన్సీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలో ఉండే ఆ ఏజెన్సీ యాజమాన్యం నెల్లూరులో ఒక మేనేజర్‌ను నియమించి ఆయన ద్వారా ఆస్పత్రిలో, మెడికల్‌ కళాశాలలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తోంది. అయితే పెద్దాస్పత్రిలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా మారింది. యాజమాన్యం కార్మికుల జీతాల్లో కోతలు పెడుతోంది. కొందరు కార్మికులు విధులకు హాజరు కాకపోయినా హాజరు వేసి జీతాలు డ్రా చేస్తున్నారు. ఇదే కాకుండా మూడు నెలల పాటు జీతాలు లేకుండా పని చేసేటట్టు ఒప్పందం కుదుర్చుకుని కొత్తగా కొంతమంది కార్మికులను మేనేజర్‌ చేర్చుకున్నట్టు విమర్శలు వస్తున్నాయి. కార్మికుల జీతాల్లో కోత పెట్టిన సొమ్మును రూరల్‌ నియోజకవర్గంలోని అధికార పార్టీకి చెందిన ఒక ప్రధానమైన వ్యక్తికి, పెద్దాస్పత్రిలోని అధికారులకు వాటా రూపంలో ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీతాల్లో కోత, ప్రశ్నించేవారిని ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం మేనేజర్‌కు వ్యతిరేకంగా కార్మికులు పోరాటానికి సిద్ధమయ్యారు. అయితే ఆస్పత్రి అభివృద్ధి కమిటీ జోక్యంతో ఘర్షణ వాతావరణం లేకుండా సర్దుబాటు జరిగింది.

సిబ్బంది సంఖ్యలో తేడా..?

ప్రభుత్వ పెద్దాస్పత్రిలో అగ్రిమెంట్‌ ప్రకారం 145 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేయాలి. అయితే సెలవులు, మెడికల్‌ లీవులు ఇవ్వాల్సి ఉన్నందున మరో 28 మందిని అదనంగా తీసుకుని మొత్తం 173 మంది పారిశుద్ధ్య కార్మికులతో పని చేయిస్తున్నారు. అలాగే మెడికల్‌ కళాశాలలో మరో 50 మంది కార్మికులు పని చేస్తున్నారు. రెండు చోట్ల కలుపుకుని మొత్తం 223 మంది కార్మికులు, సూపర్‌వైజర్లు పని చేస్తున్నారు. అలాగే పెద్దాస్పత్రిలో 110 మంది సెక్యూరిటీ సిబ్బంది, మెడికల్‌ కళాశాలలో 27 మంది సెక్యూరిటీ కలిపి మొత్తం 137 మంది పనిచేస్తున్నారు. ఇవన్నీ కాగితాల్లో లెక్కలు మాత్రమే. వాస్తవాన్ని పరిశీలిస్తే అంతమంది పని చేయడం లేదు. పెద్దాస్పత్రిలో 145 మందికి గానూ 120 మంది మాత్రమే పని చేస్తున్నారు. మెడికల్‌ కళాశాలలో కూడా అంతే. పెద్దాస్పత్రిలో పని చేసే కార్మికులనే మెడికల్‌ కళాశాలలో పని చేయిస్తుంటారు. ఇలా పలువురి జీతాలను మిగుల్చుకుంటారు. ఈ లెక్కలు బయట పడాలంటే బయోమెట్రిక్‌ హాజరు, ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు పోల్చి చూడాల్సిన అవసరం ఉంది.

కొత్తగా చేర్చుకుంటే లంచాలు

కొంతమంది చదువులేని కార్మికులకు పుట్టిన తేదీ లేదు. ఆధార్‌ ఉండటం లేదు. పీఎఫ్‌ ఖాతాలో నగదు జమ చేసేందుకు ఏదో ఒక గుర్తింపు ఉండాలి. అయితే 14 మంది కార్మికులకు పాస్‌పోర్టు తయారు చేయించి ఇస్తామని దానిలోని పుట్టిన తేదీ ఆధారంగా పీఎఫ్‌ నగదు జమ చేస్తామని మేనేజర్‌, ఒకరిద్దరు సూపర్‌ వైజర్లు నమ్మబలికారు. నెల్లూరులోనే పాస్‌ పోర్టు కార్యాలయం ఉంది. ఫీజు కేవలం రూ.1500 మాత్రమే. ఏజెంట్‌ ఫీజు మరో రూ.1000 కలుపుకుని మొత్తం రూ 2,500 మాత్రమే. 14 మంది కార్మికులకు పాస్‌పోర్టు చేయిస్తామని రూ.15 వేల వంతున వసూలు చేశారు. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన సమావేశంలో నేరుగా ఒక కార్మికురాలు ధైర్యం చేసి హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ మడపర్తి శ్రీనివాసులుకు తెలిపింది. ఎవరు వసూలు చేశారని ఆయన అడగగా ఒక సూపర్‌వైజర్‌ను నేరుగా వేలుపెట్టి చూపింది. అయితే తమను ఉద్యోగంలో నుంచి తీసేస్తారనే భయంతో పలువురు ఫిర్యాదు చేయడం లేదు.

నెలకు రూ.80 లక్షలు విడుదల

పెద్దాస్పత్రి, మెడికల్‌ కళాశాలలో పని చేసే పారిశుద్ధ్య, సెక్యూరిటీ గార్డులకు నెలకు ప్రభుత్వం రూ.80 లక్షలు విడుదల చేస్తోంది. అగ్రిమెంట్‌ ప్రకారం పారిశుద్ధ్యం బాగుండాలి. డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండకూడదు. మ్యాన్‌ హోల్స్‌ శుభ్రపరచాలి. పరిసరాల్లో గడ్డి లేకుండా చేయాలి. ఇలా పది రకాలుగా నిబంధనలు పాటించాలి. ఒక్కో నిబంధన సక్రమంగా పూర్తి చేస్తే అందుకు కొన్ని మార్కులుంటాయి. ఈ నిబంధనలు ఏమీ పాటించక పోయినా పెద్దాస్పత్రి సూపరింటెండెంట్‌గా సిద్ధానాయక్‌ శానిటేషన్‌కు 96 శాతం మార్కులు తగ్గకుండా వేస్తున్నారు. అంటే రూ.80 లక్షల్లో రూపాయి కూడా తగ్గకుండా ఏజెన్సీకి అందుతాయి. ఈ నిధుల్లో రాజకీయ నాయకుల దగ్గర నుంచి అధికారుల వరకు కమీషన్లు చేతులు మారుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.

లంచాలు తీసుకుని కొత్తవారి నియామకం

కొత్తగా సెక్యూరిటీ గార్డులను, శానిటరీ వర్కర్స్‌ను చేర్చుకుంటే వారి నుంచి రూ.35 వేలు నుంచి రూ.50 వేలు వరకు వసూలు చేస్తున్నారు. సూపర్‌వైజర్‌కు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. లేదంటే కొంతకాలం పాటు జీతాలు లేకుండా పని చేయాలని ఒప్పందాలు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. గూడూరు పట్టణానికి చెందిన ఓ కార్మికురాలు మెడికల్‌ కళాశాలలో లంచాలు ముట్టచెప్పించి ముగ్గురు వ్యక్తులను చేర్పించినట్టు విశ్వసనీయ సమాచారం.

లంచాలతో ఫేక్‌ సర్టిఫికెట్‌లు

పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తే గట్టిగా వచ్చేది రూ.10వేలు మాత్రమే. అయితే ఆస్పత్రిలో పనిచేసే ఒక కార్మికురాలు ఒకటిన్నర సంవత్సరం క్రితమే మానేసింది. ఆమె మూడు నెలల క్రితం పెద్దాస్పత్రిలో పని చేస్తున్నట్టు కటింగ్స్‌ పోను ఇంకా రూ.30వేలు జీతం వస్తున్నట్టు ఒక శాలరీ సర్టిఫికెట్‌ను ఏజెన్సీ సంస్థ పేరుతో ఇచ్చారు. దానిని బ్యాంకులో చూపెట్టి రూ.3లక్షలు రుణం కూడా ఆమె పొందింది. ఇందుకోసం ఆ మహిళ లంచం ముట్టచెప్పింది. మేనేజర్‌కు అనుకూలంగా ఉన్న ఓ సూపర్‌ వైజర్‌ లంచాలు తీసుకుని ఇలాంటి ఫేక్‌ సర్టిఫికెట్‌లను పలువురికి ఇచ్చింది.

జీతాలు,

పీఎఫ్‌లో

కోతలు

శానిటరీ, సెక్యూరిటీ విభాగాల్లో కొన్ని లోపాలున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఏజెన్సీ కాంట్రాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన నాలుగు రోజుల్లో అన్నీ సరిచేస్తామన్నారు. తాము పరిశీలించి కార్మికులకు న్యాయం చేస్తాం. లోపాలు సరిచేస్తాం. – నరేంద్ర,

సూపరింటెండెంట్‌, ఎఫ్‌ఏసీ, పెద్దాస్పత్రి

ప్రభుత్వ అగ్రిమెంట్‌ ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు జీతంగా రూ.16 వేలు ఇవ్వాల్సి ఉండగా పీఎఫ్‌, ఈస్‌ఐ లాంటి కటింగ్స్‌ పోగా రూ.13,500 కార్మికుని ఖాతాలో జమ చేయాలి. అలాగే సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి ఇవ్వాల్సిన రూ.14,800 జీతంలో పీఎఫ్‌, ఈఎస్‌ఐ తదితరాలు పోగా రూ.10,500 జమ చేయాలి. అయితే వీరికి ఇవ్వాల్సిన జీతం పూర్తి స్థాయిలో అందడం లేదు. రెగ్యులర్‌గా డ్యూటీలకు వచ్చినప్పటికీ చదువురాని అనేక మందికి హాజరు తగ్గించి వేసి జీతాలు ఇస్తున్నారు. కొంతమందికి రూ.6 వేలు నుంచి రూ.7 వేలు మాత్రమే ఇస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బందిదీ అదే పరిస్థితి. ఇక కార్మికుని ఖాతాలో జమ చేయాల్సిన పీఎఫ్‌లో ప్రతి నెలా కొంత మందికి కోత విధిస్తున్నారు. జీతం ఎందుకు తగ్గించారని ప్రశ్నిస్తే ఇక వేధింపులే. కార్మికుల నోట్లో మట్టి కొడుతున్నారు.

లోపాలు సరి చేస్తున్నాం 1
1/1

లోపాలు సరి చేస్తున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement