
స్మార్ట్ మీటర్లు, విద్యుత్ కొనుగోళ్లపై టీడీపీ ద్వంద్వ
నెల్లూరు (వీఆర్సీసెంటర్): రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, ఈ విషయంలో ద్వంద్వ వైఖరిని అవలబిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం నగరంలోని బాలాజీనగర్‌లో ఉన్న సీపీఎం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేయకుండా జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హైకోర్టుకు వెళ్లారని, పయ్యావుల కేశవ్ కూడా విద్యుత్ కొననుగోళ్ల విషయంలో కోర్టుకు వెళ్లారని వీరు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న విద్యుత్ కొనుగోళ్లు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విషయాల్లో కేసులను కొనసాగిస్తారా?ఉపసంహరించుకుంటారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఒక విధంగా, అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. విద్యుత్ కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం రూ.1.25 లక్షల కోట్లపైగా అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. అదే విధంగా టిడ్కో గృహాలు ఇప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వలేదని, గత ఎన్నికల సమయంలో టీడీపీ చెప్పిన విధంగా పేదలకు నగరాల్లో నివసించే వారికి 2 సెంట్లు, గ్రామాల్లో నివసించేవారికి 3 సెంట్లు భూమి ఇచ్చి రూ.5 లక్షల ఇంటి నిర్మాణానికి అందజేయాలని డిమాండ్ చేశారు.
అమెరికా ఒత్తిడికి తలొగ్గిన మోదీ
అమెరికా ఆదేశాలతో కాల్పుల విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా చెప్పడంతో మనదేశ ప్రతిష్ట పూర్తిగా దిగజారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు దుయ్యబట్టారు. ఉగ్రవాదుల్ని తుదముట్టించే వరకు ఆపరేషన్ సిందూర్ ఆగదని దేశ ప్రజలను ప్రదాని మోదీ మభ్య పెడతున్నారని విమర్శించారు. తీవ్రవాదుల్ని మట్టుబెట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిన మోదీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అంటూ తిరంగా ర్యాలీ చేపట్టాలని బీజేపీ నిర్ణయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశ ప్రజలను ఐక్యం చేసి, కశ్మీర్ ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని అన్ని పార్టీలను ఒక తాటి పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కశ్మీర్ విషయంలో తాము మధ్యవర్తిత్వం నెరిపామని ట్రంప్ చెప్పడం మోదీ చేతకాని తనం బయట పడినట్లు అయిందన్నారు. దేశాన్ని, మోదీని ట్రంప్ ఆదేశిస్తున్నారని ఇది ఎంతో సిగ్గు చేటన్నారు. మతపరమైన ప్రనసంగాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే పవన్‌కళ్యాణ్ కాల్పుల విరమణపై నోరువిప్పడం లేదన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, అజయ్‌కుమార్ పాల్గొన్నారు.
గతంలో కోర్టుల్లో కేసులు వేసిన
టీడీపీ ఎమ్మెల్యేలు
ఇప్పుడు ఇదే బాటలో పయనిస్తున్న కూటమి ప్రభుత్వం
కేసులు కొనసాగిస్తారా?
ఉపసంహరించుకుంటారా?
విద్యుత్ కొనుగోళ్లలో
రూ.1.25 లక్షల కోట్ల అక్రమాలు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
వి. శ్రీనివాసరావు