
చీకట్లోనే బ్రహ్మోత్సవాలు
● విద్యుత్ శాఖ నిర్లక్ష్యం
● 7 గంటల పాటు సరఫరాలో కోత
ఉలవపాడు: రథోత్సవం కోసం అంటూ విధించిన విద్యుత్ కోత చివరకు బ్రహ్మోత్సవాలను కూడా చీకటి చేసింది. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మండల కేంద్రంలో 7 గంటలపాటు విద్యుత్ లేదు. సాధారణంగా ప్రతి ఏడాది సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ప్రారంభమై 7 గంటల్లోపు ముగిసేది. ఆ తర్వాత విద్యుత్ వెంటనే ఇచ్చేవారు. అయితే ఈ ఏడాది రథం స్థానంలో పుష్పపల్లకి రథం ఏర్పాటు చేశారు. ఇంకా త్వరగా పూర్తి కావాల్సి ఉన్నా బాగా ఆలస్యంగా ప్రారంభించారు. దీంతో రథోత్సవం 6.30 గంటలకు ప్రారంభమై 8.45 గంటలకు తిరిగి గుడి వద్దకు వచ్చింది. అయితే విద్యుత్ శాఖ అధికారులు మాత్రం మధ్యాహ్నం 2.45 గంటలకే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పుష్పపల్లకి రథోత్సవం తిరిగొచ్చిన గంట తర్వాత కూడా 9.45 గంటల వరకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదు. రథోత్సవానికి ముందు 3.45 గంటలు, తర్వాత గంట, మధ్యలో 2.15 గంటల లెక్కన 7 గంటల పాటు ఏకధాటిగా విద్యుత్‌కోత విధించడంలో అసలు ఎండాకాలంలో అల్లాడుతున్న జనానికి మరింత ఇబ్బంది కలిగించారు. స్థానికంగా ఏఈ లేకపోవడం, పైఅధికారులెవరూ రాకపోవడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు మండి పడ్డారు. బ్రహ్మోత్సవాల కోసమే విద్యుత్ సరఫరా నిలిపివేసినా.. చీకట్లోనే నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. దుకాణాలు, విద్యుత్ కటౌట్లన్నీ రాత్రి వరకు చీకట్లోనే ఉన్నాయి. రథోత్సవం మండల కేంద్రంలోని కేవలం పాతూరులోని 4 బజార్లలో మాత్రమే వెళుతోంది. దీని కోసం జంపర్‌లు ఏర్పాటు చేసి ఆ కొంత ప్రాంతం తీసి గ్రామం అంతా ఇవ్వవచ్చు. కానీ అలా చేయకుండా ఊరు మొత్తం 7 గంటలు విద్యుత్ కోత విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.