
స్వయంశక్తితో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
● కలెక్టర్ ఆనంద్
ఇందుకూరుపేట: ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో స్వయంశక్తి సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. డీఎర్‌డీఏ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అరటినార ఉత్పత్తుల శిక్షణా కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఈ శిక్షణా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఇంటి వద్ద నుంచే మెరుగైన ఆదాయం పొందాలని కోరారు. శిక్షణ పూర్తి చేసుకొన్న మహిళలకు అరటినార ద్వారా ఉత్పత్తులను తయారు చేసేందుకు అవసరమైన యంత్రాల కోసం రుణాలు మంజూరు చేస్తామన్నారు. లాభాలు గడించేందుకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రీసైక్లింగ్ యాక్టివిటీస్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఇండియా మిషన్ సహకారంతో అరటి నారతో వస్తువులు తయారు చేయడంపై శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. ఇందుకూరుపేటలో 30 మంది మహిళలను ఒక బ్యాచ్‌గా ఏర్పాటు చేసి శ్రీకాకుళానికి చెందిన అప్పమ్మ ద్వారా నెల రోజుల పాటు శిక్షణ ఇస్తున్నామన్నారు. తొలుత అరటి నార ద్వారా ఏ వస్తువులు తయారు చేస్తున్నారు, శిక్షణ ఎలా ఉంది, శిక్షణ పూర్తయిన తర్వాత సొంతగా వస్తువులను తయారు చేయగలరా, ఎంత ఖర్చవుతోంది, ఆదాయం ఎంత ఉంటుందని తదితర అంశాలపై శిక్షణ పొందుతున్న మహిళతో ముచ్చటించి ఆరా తీశారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా అరటినార ఉత్పత్తులపై శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, తహసీల్దారు కృష్ణప్రసాద్, ఏపీఎం సరిత, ఏసీ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.