
వైభవం.. తెప్పోత్సవం
పుష్కరిణిలో తెప్పపై విహరిస్తున్న స్వామి అమ్మవార్లు
● పుష్కరిణిలో నరసింహుని విహారం
● ముగిసిన పెంచలకోన బ్రహ్మోత్సవాలు
రాపూరు: పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం రాత్రి శోభాయమానంగా అలంకరించిన తెప్పపై పెనుశిల నరసింహస్వామి ఉభయనాంచారులతో కలసి కొలువుతీరి పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శమిచ్చారు. నరసింహస్వామి వారి ఆలయంలో ఆరు రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు పెనుశిల లక్ష్మీనరసింహస్వామికి తెప్పోత్సవం నిర్వహించారు. రాత్రి 10 గంటలకు స్వామి వారిని అశ్వవాహనంపై ఉంచి కోన మాడ వీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. రాత్రి 11 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
అంతకుముందు ఉదయం శ్రీవారి చక్రస్నానం కనులపండువగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు, సుదర్శన చక్రం విగ్రహాలను పల్లకిలో కొలువుదీర్చి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య పుష్కరిణిలో స్వామివారి చక్రతల్వార్ (సుదర్శన చక్రం)ను పుష్కరిణిలో చక్రస్నానం చేయించారు.
వైభవంగా వసంతోత్సవాలు
పెంచలకోనలో స్వామి వారికి వసంతోత్సవాలు నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామి అమ్మవార్లకు వసంతాలు చల్లి కార్యక్రమాన్ని ప్రారంభించారు.