
ఉద్యమం ఉధృతం చేస్తాం
నెల్లూరు సిటీ: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను త్వరితంగా పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని ఎన్‌ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు తెలిపారు. నెల్లూరు నగరంలోని ప్రధాన ఆర్టీసీ బస్టాండు వద్ద ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రజా రవాణా అధికారి కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు. అనంతరం ఆర్టీసీ ప్రాంగణంలో కార్మికులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమంలో భాగంగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై అనేక సార్లు విన్నవించుకున్నామని, అయినప్పటికీ సమస్యలు పరిష్కరించకుండా పోరాటం చేస్తున్న కార్మికులు, నాయకులపై వేధిపులకు పాల్పడుతోందన్నారు. సర్క్యులర్ 1–2013 ఉద్యోగ భద్రతను వెంటనే అమలు చేయాలన్నారు. నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్‌లు వెంటనే ఇవ్వాలని, అక్రమ సస్పెన్సన్‌లు, రీమూవల్స్‌ను నిలుపుచేయాలని కోరారు. ఈహెచ్‌ఎస్ కార్డు బదులుగా పాత వైద్య విధానాన్ని కొనసాగించాలన్నారు. మహిళలకు పిల్లల సంరక్షణ సెలవులు తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మురళీమోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు చెంచయ్య, జిల్లా అడ్వైజర్ జె వెంకటేశ్వర్లు, నాయకులు ఎల్లయ్య, మాధవరావు, పద్మారావు పాల్గొన్నారు.
ఎన్‌ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
వై శ్రీనివాసరావు
ఆ సంఘం ఆధ్వర్యంలో
పీటీఓ కార్యాలయం ముట్టడి