
● గల్లంతైన అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం ● సంగం, కోవూరులో
కనిగిరి రిజర్వాయర్ పెద్దకాలువలో గాలిస్తున్న గజఈతగాళ్లు
సంగం: ఆ ఇద్దరే ఆ తల్లిదండ్రులకు బిడ్డలు. ఒక తల్లి కడుపున పుట్టారు. కలిసి పెరిగారు. కలిసి తిరిగారు. చివరికి కలిసి మరణించారు. ఒకరిని పిలిస్తే మరొకరు పలికే విధంగా ఆ ఇంట ఆనందాన్ని పంచిన ఆ ఇరువురు అన్నదమ్ములు కాలువలో పడి మృతి చెందిన హృదయవిదారక ఘటన కన్నీరు తెప్పిస్తోంది. సంగంలోని కనిగిరి రిజర్వాయర్ పెద్ద కాలువలో సోమవారం పడి గల్లంతైన ఇద్దరు అన్నదమ్ముల మృతదేహాలు మంగళవారం బయటపడ్డాయి. సంగం, కోవూరులో విషాదాన్ని నింపిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. సంగంకు చెందిన దండె వెంకటరమణమ్మ చిన్న కుమార్తె శేషమ్మ, గోవిందయ్య దంపతుల ఇద్దరు కుమారులు బందా వెంకట చందు (15), వెంకట నందకిశోర్ (13) వేసవి సెలవుల కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చారు. సోమవారం రోజులాగే కనిగిరి రిజర్వాయర్ పెద్దకాలువలో నీటి ప్రవాహ ఉధృతిని గమనించక దిగి గల్లంతైన విషయం తెలిసిందే. రాత్రి వరకు పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం ఉదయం నుంచి మళ్లీ గాలింపు చర్యలను ప్రారంభించారు. మృతదేహాలను వెలికి తీసేందుకు గజ ఈతగాడు వెంకటేశ్వర్లుతోపాటు మరికొందరు మత్స్యకారులు గాలించగా తొలుత వెంకటచందు మృతదేహం బయటపడగా, కొన్ని గంటల అనంతరం వెంకట నందకిషోర్ మృతదేహం బయట పడింది. గజ ఈతగాళ్లు చేతుల మీదుగా మృతదేహాలను తీసుకు వస్తుండగా ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా రోదనలతో నిండిపోయింది. ఆ ఇద్దరు చిన్నారులతో ఆనందంగా గడిపిన అమ్మమ్మ వెంకటరమణమ్మతోపాటు అపురూపంగా చూసుకుంటున్న తల్లిదండ్రులు శేషమ్మ, గోవిందయ్యలను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. పోస్టుమార్టం అనంతరం చిన్నారుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

● గల్లంతైన అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం ● సంగం, కోవూరులో

● గల్లంతైన అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం ● సంగం, కోవూరులో