
బంగారు గరుడపై శ్రీవారి చిద్విలాసం
● రారాజుపై యోగనరసింహుని వైభోగం ●
● భక్తులతో కిక్కిరిసిన పెంచలకోన
రాపూరు: ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెనుశిల లక్ష్మీనరసింహస్వామికి రాత్రి బంగారు గరుడవాహనసేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన గరుడ వాహనంపై శ్రీవారిని శంఖు, చక్ర, అభయహస్తాలతోపాటు వివిధ రకాల ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా ఆలకరించి కొలువు తీర్చినంతరం భక్తులు దర్శించుకున్నారు. రాత్రి 11 గంటలకు శ్రీవారు బంగారు గరుడ వాహనంపై కోన తిరుమాడవీధుల్లో ఊరేగారు. భక్తులు గోవింద నామస్మరణలతో పెంచలకోనలోని వెలుగొండలు మార్మోగాయి. శ్రీవారి గరుడ వాహనం మోసేందుకు భక్కులు పోటీ పడ్డారు. గరుడ వాహన సేవలో ఎలాంటి అపశృతులు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రారాజుపై కొలువు దీరి..
యోగ నరసింహుడు రారాజుపై కొలువు దీరి వైభవంగా ఊరేగారు. ఆదివారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు స్వామి, ఆదిలక్ష్మీదేవి, ఆంజనేయస్వామికి పూలంగి సేవ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు సింహ వాహనంపై శ్రీవారి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి శాంత రూపంలో ఉన్న యోగనరసింహస్వామిగా అలంకరించారు. వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామికి కోన మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. రాత్రి జరిగే గరుడ సేవను తిలకించేందుకు తరలివచ్చిన భక్తజన సందోహంతో పెనుశిల క్షేత్రం కిక్కిరిసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ అధికారులు చేపట్టారు. తిరుపతి, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. పలువురు భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. స్వామి, అమ్మవార్లను, ఆంజనేయస్వాములను దర్శించుకున్నారు.
యాగశాలలో చతుష్టానార్చన హోమం
పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న యాగశాలలో ఉదయం చతుష్టానార్చన హోమాన్ని టీటీడీ ఆగమ పండితులు రామానుజచార్యులు ఆధ్వర్యంలో పండితులబందం నిర్వహించారు. అగ్నిప్రతిష్ట, విశేష హోమాలు నిర్వహించారు. స్వామి తేజస్సు పెంచేందుకు భక్తుల క్షేమ, ఆయురారోగ్యాల కోసం నిర్వహించినట్లు పండితులు చెప్పారు.
కోనలో నవకలిశ స్నపన తిరుమంజనం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెంచలకోనలో శ్రీవారు, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీ దేవేరులకు ఉదయం 11.30 గంటలకు నవకలిశ స్నపన తిరుమంజనాన్ని అర్చకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పంచామృతం, పసుపు, కొబ్బరి నీళ్లతో ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు.
మొక్కులు తీర్చుకున్న భక్తులు
బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు కోనకు చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించి మొక్కులు తీర్చుకు న్నారు. రోగగ్రస్తులు స్వామి వారి కోనేరులో స్నామాచరించారు. పిల్లలు లేనివారు అదిలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఉన్న వటవృక్షానికి ఊయలు కట్టి మొక్కుకున్నారు.
శాస్త్రోక్తంగా ఊంజల్ సేవ
రాత్రి 7 గంటలకు పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీ దేవేరులను తిరుచ్చిలో ఉంచి శోభాయమానంగా అలంకరించి మేళతాళాలు, మంగళవాయిద్యాలతో సహస్రదీపాలంకరణ మండపంలోకి తీసుకొచ్చారు. అక్కడ 1008 దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లకు వేదపండితులు మంత్రోచ్ఛరణలు నిర్వహిస్తూ ఊంజల్ సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీ శ్రీనివాసులురెడ్డి, ఫెస్టివల్ కమిటీ సభ్యులు చెన్ను తిరుపాల్‌రెడ్డి, సోమయ్య, ఉప ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి, సీతా రామయ్యస్వామి, టీటీడీ పాంచరాత్ర ఆగమపండితులు రామానుజాచార్యులు పాల్గొన్నారు.
నేడు శ్రీవారి తిరుకల్యాణం
పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 6 గంటలకు శ్రీవార్లకు పూలంగి సేవ, 9.50 గంటలకు శ్రీవారి కల్యాణం, సాయంత్రం 6 గంటలకు రథోత్సవం, రాత్రి 9 గంటలకు గజవాహన సేవ, రాత్రి 12 గంటలకు ఏకాంతసేవ జరుగుతుందని అధికారులు తెలిపారు.

బంగారు గరుడపై శ్రీవారి చిద్విలాసం