
ఎక్కడెక్కడ ఏం జరుగుతోందంటే..
రొయ్యల ప్రాసెస్ ఫ్యాక్టరీ
● సాగునీటి కాలువల్లోకి
రొయ్యల కంపెనీల వ్యర్థాలు
● మృత్యువాత పడుతున్న మత్స్యసంపద
● చౌడు బారుతున్న
20 వేల ఎకరాల సాగు భూములు
● కలుషిత నీటితో పశువులూ మృతి
● లబోదిబోమంటున్న రైతులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఇందుకూరుపేట మండలం డేవిస్‌పేట, జగదేవిపేట గ్రామాల పరిధిలో ఉన్న స్టార్ ఆగ్రో మైరెన్ ఎక్స్‌పోర్ట్స్, సాయి మైరెన్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల నుంచి వచ్చే రసాయన వ్యర్థ జలాలను గంగపట్నం – మైపాడుకు వెళ్లే పంట కాలువల్లోకి వదిలేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీలలో రొయ్యల ప్రాసెసింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో వాటిలో రసాయనాలు ఉపయోగిస్తారు. ప్రక్రియ పూర్తయిన తరువాత బయటకు వచ్చే రసాయన వ్యర్థాలతో కూడిన నీటిని పంట కాలువల్లోకి వదలడంతో అవి నేరుగా చెరువుల్లోకి చేరుతోంది. దాంతో చెరువుల్లో నీరు విషతుల్యమై మత్స్యసంపద చనిపోతోంది. ఇటీవల గంగపట్నం, కొమరిక, నరసాపురం గ్రామాల చెరువులలో చేపలు మృత్యువాతపడి రైతులు ఆర్థికంగా నష్టపోయారు.
నిబంధనల ఉల్లంఘన
జిల్లాలో 33,128 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఆ రంగానికి అనుబంధంగా పది వరకు రొయ్యల ప్రాసెస్ యూనిట్లు, 61 సీడ్ ప్లాంట్‌లు, 22 సీడ్ హేచరీలు ఉన్నాయి. ఆయా ప్రాసెస్ యూనిట్లు, హేచరీల్లో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. చాలా వరకు పీసీబీ ప్రమాణాలు పాటించడం లేదు. యూనిట్ల నుంచి వచ్చే రసాయనాలు కలిసిన వ్యర్థాలు పంట కాలువల్లోకి వదిలేస్తున్నారు. దీనివల్ల భూములు చౌడు బారి బీళ్లుగా మారిపోతున్నాయి. పంట ఎదుగుదల క్షీణించిపోతోంది. రసాయన వ్యర్థాలు భూగర్భంలోకి ఇంకి తాగునీరు కూడా కలుషితమతుతోంది.
పశువుల ప్రాణాలు హరీ
రొయ్యల శుద్ధికి సోడియం క్లోరైడ్, అమోనియా లాంటి ప్రమాదకర రసాయనాలు వాడతారు. రొయ్యల నుంచి వచ్చే వ్యర్థాలు మగ్గుతాయి. కుళ్లిన వ్యర్థాలు కలిసిన నీటిని పంట కాలువల్లోకి వదిలేస్తున్నారు. ఆ నీటిని తాగడం వల్ల పశువులకు స్థానిక ప్రజలకు ప్రాణసంకటంలా మారుతోంది. గత పదేళ్లలో వివిధ రకాల వ్యాధులతో రెండు వేల వరకు పశువులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వెటర్నరీ వైద్యుల శాంపిల్స్ ల్యాబ్‌లో పరీక్షించగా కలుషిత నీటితో వచ్చే వ్యాధులు సోకినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
టీపీగూడూరు మండల పరిధిలో ఉన్న శరత్ రొయ్యల ప్రాసెస్ యూనిట్ నుంచి రసాయనాలతో శుద్ధి చేసిన వ్యర్థ జలాలను ఈదూరు, కోడూరు జాయింట్ చెరువు నుంచి వెళ్లే పంట కాలువలోక్లి వదిలేస్తున్నారు. ఆ కాలువ కింద దాదాపు 5 వేల ఎకరాలు సాగవుతోంది. రసాయనాలు కలిసిన నీరు పంటపొలాల్లోకి వెళ్తున్నాయి.
వెంకన్నపాళెంలో ఉన్న శరత్ సీడ్ ప్లాంట్ నుంచి వచ్చే రసాయనాల నీరు బకింగ్‌హాం కెనాల్‌లోకి వదిలేస్తున్నారు. కోడూరు బీచ్ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన జేజే మైరెన్, సాయి ఆక్వా, ఇండో మైరెన్, భవాని హేచరీ, ఆదిత్య హేచరీల నుంచి వ్యర్థ జలాలు బకింగ్‌హోం కెనాల్‌లోకి వదిలేస్తున్నారు. రసాయనాల కలిసిన వ్యర్థ జలాలు కాలువలో కలిసిపోవడంతో మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతోంది.
కోవూరు నియోజకవర్గం కొడవలూరు
మండలంలో ఏర్పాటైన హేచరీలు
ఆంజనేయ, గ్రీన్ హౌస్, పెడోరాల నుంచి విడుదల చేసే వ్యర్థజలాలు కూడా మలిదేవి డ్రెయిన్‌లో వదిలేస్తున్నారు. ఆ డ్రెయిన్ పరిధిలో ఆలూరుపాడు, మోదేగుంట, మానేగుంటపాడు గ్రామాల పరిధిలోని దాదాపు 300 ఎకరాల ఆయకట్టులో పంటలు సాగువుతున్నాయి. రసాయనాలు కలిసిన జలాలు డ్రెయిన్‌లో కలవడం వల్ల ఆ నీరు పారే భూములు చౌడుతేలి పంటల ఎదుగుదల క్షీణించి రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది.
గండవరం వద్ద ఏర్పాటు చేసిన ఆల్ఫా మైరెన్ ప్రాసెస్ యూనిట్ నుంచి వచ్చే రసాయన వ్యర్థ జలాలు పైడేరు కాలువలోకి వదిలేస్తున్నారు. దాని పరిధిలో అల్లూరు మండలంలోని నార్తుమోపూరు, ఆములూరు గ్రామాలకు చెందిన 800 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఇలా అధిక శాతం ప్రాసెస్ యూనిట్లు, సీడ్ హేచరీస్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి.
ఇలా చేయాలి..
రొయ్యల శుద్ధి కేంద్రాల్లో రియల్ టైం పొల్యూషన్ తెలిపే ఆర్‌టీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. తూము ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి శుద్ధి చేసిన వ్యర్థ జలాలను అందులోకి పంపించాలి. కానీ ఆ ప్లాంట్ ఏర్పాటు ఖర్చుతో కూడుకుంది కావడంతో ప్లాంట్ యజమానులు నేరుగా బయట పంట కాలువలలోకి వదిలేస్తున్నారు. వాస్తవంగా రొయ్యల శుద్ధిలో ఏడు రకాల రసాయనాలు వాడతారు. పీసీబీ ప్రమాణాలకు లోబడి శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన వ్యర్థాలను డిస్పోజ్ కంపెనీకి అప్పగించాలి. కానీ వాటిని అనధికారికంగా బయటకు పంపుతున్నారు.