
మామిడి.. పండితే ఒట్టు
ఉలవపాడు: వేసవిలో మామిడి పండును ఇష్టపడని వారుండరు. ఫలరాజుగా పిలవబడే మామిడి రుచే వేరు. కాని ఇక్కడే మనం పొరబడుతున్నాం. పసుపు రంగులో ఉన్న మామిడి కాయలన్నీ సహజంగా పండినవి కావు. రసాయనాలతో పక్వానికి వచ్చేలా చేసి బయట విక్రయిస్తున్నారు. ముందుగా వచ్చిన పూతలో 5 శాతం పంటకురావడం, ఆ వచ్చిన కాయలను కోసి వ్యాపారం ప్రారంభించారు. ఉలవపాడు మామిడికి ఉన్న బ్రాండ్ కారణంగా జాతీయ రహదారి వెంబడి ఏర్పాటు చేసిన దుకాణాలలో కాయలను కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ కాయలను పండించడానికి ఇథిలీన్ ద్రావణాన్ని కాయల మీద స్ప్రే చేస్తున్నారు. అలా చేసిన కాయలు పండినట్లుగా రంగు మారుతున్నాయి. లోపల మాత్రం రుచి ఉండడం లేదు.
ముందు వచ్చిన కొన్ని కాయలు కోసిన తరువాత ఇక ఉలవపాడు తోటల్లో కాయలు లేవు. ఇలాంటి పరిస్థితులలో దుకాణాలు ఏర్పాటు చేశారు. కాయలు కావాలి కాబట్టి కాస్త సైజులు ఉన్న లేత కాయలను కోసి అమ్మకానికి పెట్టారు. వాటికి ఇక్కడ స్ప్రే చేయడం వలన అవి పండి పసుపు రంగులో ఉండడం వలన కాయలను వాహనదారులు కొనుక్కుని వెళుతున్నారు.
ఇథిలీన్ స్ప్రే చేస్తేనే..
మామిడి కాయలకు ఇఽఽథిలీన్ స్ప్రే చేస్తేనే కాయలు పండుతున్నాయి. ఉలవపాడు హైవేపై ఏర్పాటు చేసిన అన్ని దుకాణాలలో కాయలు పండాలంటే ఇథిలీన్‌ను కొడుతున్నారు. ప్రభుత్వం ఇథిలీన్ ద్వారా పండించవచ్చని అనుమతులు ఇచ్చినా ఈ దుకాణాల్లో నిజంగా ఇథిలీన్‌నే స్ప్రే చేస్తున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కాయలు మాత్రం పండినా రుచి ఉండడం లేదు. కాయలు ఎలాంటి స్ప్రేలు లేకుండా పండాలంటే కాయలు పూర్తిగా పక్వానికి వచ్చిన తరువాత కోయాలి.
ఈ విషయమై ఉలవపాడు ఉద్యానశాఖ అధికారి జ్యోతి మాట్లాడుతూ ఇంకో 15 రోజుల్లో కాయలు పూర్తిగా పంటకు వస్తాయి. అప్పుడు మాత్రమే ఇక్కడి కాయలను తీసుకుంటే నాణ్యత రుచి ఉంటుంది.
పక్వానికి రాకుండా లేత కాయల కోత
ఇథిలీన్ కొడితేనే రంగు
కాయలు కొని మోసపోతున్న
మామిడి ప్రియులు
పూర్తిస్థాయిలో రాని మామిడి