
ప్రభుత్వ బడులను పరిరక్షించండి
కలెక్టరేట్ వద్ద ధర్నాలో ఉపాధ్యాయులు
నెల్లూరు(అర్బన్): ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు దశరథరాములు, హజరత్‌లు మాట్లాడారు. ప్రభుత్వం రోజుకో నిర్ణయంతో విద్యావిధానంలో గందరగోళ పరిస్థితులను కల్పిస్తోందని విమర్శించారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని కోరారు. నూతనంగా అప్‌గ్రేడ్ చేసిన ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా హెడ్‌మాస్టర్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు మంజూరు చేయాలన్నారు. సీపీఎస్, జీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7 తరగతులున్న చోట 4 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను, 6,7,8 తరగతులున్న చోట 6 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించాలి కోరారు. లేదంటే భవిష్యత్‌లో ఐక్య ఉద్యమాలు చేపడతామన్నారు. అనంతరం కలెక్టరేట్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో ఆ సంఘం నాయకులు సురేఖ, రఘురామిరెడ్డి, శరత్‌బాబు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
విద్యా విధానంలో
సర్కారు తీరుపై నిరసన
ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా