
అధికారులకు లంచం ఇస్తే చాలు
● గ్రావెల్ దందాను వెలుగులోకి తెచ్చిన ఫోన్ కాల్ రికార్డింగ్
● తహసీల్దార్ రూ.30 వేలు
అడిగారంటూ వ్యాఖ్యలు
సోమశిల: అధికార పార్టీ అయితే సరిపోదు.. అధికారులను ప్రసన్నం చేసుకుంటే గ్రావెల్ దందాను కొనసాగించవచ్చనే విషయం అక్రమంగా గ్రావెల్ తోలుతున్న ఓ వ్యక్తి ఫోన్ కాల్ రికార్డింగ్ ద్వారా వెలుగులోకి వచ్చింది. గ్రావెల్ తోలాలంటే తహసీల్దార్‌కు లంచం ఇస్తే వదిలేస్తుందంటూ తన స్నేహితుడితో చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ వ్యవహారం గ్రావెల్ మాఫియా, అధికారుల మధ్య ఉన్న సంబంధాలను బయటపెట్టింది. అనంతసాగరం మండలంలోని మంచాలపల్లి చెరువు కట్ట సమీపంలో ఉన్న కొండ ప్రాంతం నుంచి కొందరు ఎలాంటి అనుమతి లేకుండా రాత్రి వేళ్లలో జేసీబీలతో గ్రావెల్ తవ్వి ట్రాక్టర్లలో తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై గురువారం వెలుగులోకి వచ్చిన ఓ ఫోన్ కాల్ రికార్డింగ్ వైరలైంది. గ్రావెల్ తరలిస్తున్న వ్యక్తి తన స్నేహితుడితో ఇలా మాట్లాడాడు. గతంలో ఎస్సైకు మామూళ్లు ఇచ్చి గ్రావెల్ తోలేవాడినని, ఇటీవల ఓ గ్రామ రెవెన్యూ అధికారి తనకు కొంత ఇవ్వాలని అడగడంతో ఇచ్చానన్నాడు. దందా విషయమై తహసీల్దార్‌కు సమాచారం అందడంతో ఆమె ఫోన్ చేసి లంచం ఇస్తావా లేదంటే కేసులు పెట్టాలా అని రూ.30 వేలు డిమాండ్ చేసినట్లు స్నేహితుడితో ఫోన్‌లో చెప్పాడు. తనకు ఏమీ మిగలకపోగా సొంత నిధులు ఖర్చవుతున్నాయంటూ అతను చెప్పిన మాటలు కలకలం రేపాయి.