
కీలకాధికారి పాత్ర
కందుకూరు నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. అక్రమార్జనే ధ్యేయంగా సాగునీటి చెరువులను గుల్ల చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలు, అధికారుల ఉదాసీనతతో వీరి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. భారీ యంత్రాలతో మట్టిని తవ్వి వందల ట్రిప్పుల్లో తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండా సాగుతున్న ఈ వ్యవహారంతో ఇరిగేషన్ శాఖ పరిధిలోని చెరువులు భారీ గుంతలతో దర్శనమిస్తున్నాయి.
ఇరిగేషన్ చెరువులే
లక్ష్యంగా భారీ దోపిడీ
● గుల్ల చేస్తున్న వైనం
● ప్రైవేట్ వెంచర్లు,
రోడ్ల నిర్మాణం పేరిట తవ్వకాలు
● కన్నెత్తి చూడని ఇరిగేషన్ అధికారులు
కందుకూరు: ఇరిగేషన్ చెరువుల్లో మట్టిని కొల్లగొట్టడంలో అధికార పార్టీ నేతలు తలమునకలై ఉన్నారు. వలేటివారిపాళెం, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లోని పలు చెరువుల్లో భారీగా తవ్వకాలను చేపట్టారు. రెండు, మూడు నెలలుగా యథేచ్ఛగా సాగుతున్నా, ఆ శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. వలేటివారిపాళెం మండలంలోని నూతన జాతీయ రహదారి పక్కన ఉన్న కేజీబీవీ స్కూల్ సమీపంలో ప్రైవేట్ వ్యక్తులు ఇటీవల దాదాపు మూడెకరాల్లో వేసిన వెంచర్‌కు రామన్న చెరువు నుంచి రెండు వేల ట్రిప్పుల మట్టిని తోలారు. ఈ విషయం ఇరిగేషన్ శాఖ అధికారులకు తెలిసినా, పట్టించుకున్న దాఖలాల్లేవు. పూర్తిగా తోలాక అడ్డుకున్నామనే రీతిలో షో చేశారు.
దౌర్జన్యంగా..
వలేటివారిపాళెం మండలంలో పెత్తనం చేసి ఓ యువ నేత లింగసముద్రం మండలంలోని మాలకొండరాయునిపాళెం చెరువు నుంచి భారీ ఎత్తున మట్టి తవ్వకాలు చేపట్టి రోడ్డు నిర్మాణానికి తరలించారు. వాస్తవానికి ఇక్కడ మట్టి తోలేందుకు ఎలాంటి అనుమతుల్లేవు. అయినా దౌర్జన్యంగా తమ పనిని కానిచ్చారు. ఫలితంగా చెరువు పూర్తిగా గుంతలమయమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెదపవని చెరువు నుంచి గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున తవ్వి విక్రయించారు.
మోచర్ల చెరువు గుల్ల
గుడ్లూరు మండలంలోని మోచర్ల చెరువు నుంచి ఓ పెట్రోల్ బంక్ యజమానులు 1650 క్యూబిక్ మీటర్ల పరిధిలో తవ్వకాలు జరిపారు. ఇరిగేషన్ శాఖ నుంచి వీరికి ఎలాంటి అనుమతి లేదు. మండలంలోని పెద్ద చెరువుల నుంచి మూడు రోజులుగా ఓ ప్రైవేట్ వ్యక్తి భారీ ఎత్తున గుడ్లూరుకు తరలించి విక్రయిస్తున్నారు. ఇళ్ల లెవలింగ్‌కు రావూరు చెరువులో పెద్ద గుంతలు చేసి తవ్వకాలు జరిపారు.
వెంచర్లకు తరలింపు
ఉలవపాడు మండలంలోని రాజుపాళెం చెరువు నుంచి జాతీయ రహదారి పక్కన వేసిన ఓ వెంచర్‌కు భారీ ఎత్తున తరలించారు. భీమవరం చెరువు నుంచి దాదాపు 300 ట్రిప్పుల్లో వీటిని పంపారు. కందుకూరు మండలంలోని ఓగూరు వద్ద గణేష్‌కుంట నుంచి పొలాలకు మేరవ తోలే పేరుతో 500 ట్రిప్పుల మట్టిని ప్రైవేట్ వ్యక్తులు ఇటీవల తరలించారు.
గ్రామస్తుల ధర్నా
మట్టి తవ్వకాలను అడ్డుకోవాలంటూ మున్సిపాల్టీ పరిధిలోని వెంకటాద్రిపాళెం వాసులు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను చేపట్టారంటే నియోజకవర్గంలో దందా ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు భారీ ఎత్తున గుంతలు చేసి మట్టిని తవ్వి విక్రయిస్తున్నారు. దీంతో సమీపంలోనే ఉన్న తమ పొలాలకు దారుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వీరి ధర్నాను సవాల్‌గా తీసుకున్న మాఫియా అదే రోజు రాత్రి పెద్ద ఎత్తున యంత్రాలను ఏర్పాటు చేసి మట్టి తవ్వకాలు చేపట్టడం గమనార్హం.
భద్రతకు ముప్పు
మట్టి తవ్వకాలతో చెరువుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. భారీ యంత్రాలను మాఫియా ఏర్పాటు చేసి ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు. పలు చెరువుల్లో కట్ట వెంటా ఇదే వ్యవహారం సాగుతోంది. చెరువు కట్టలు బలహీనమై వర్షాలు కురిసి నిండితే తెగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇరిగేషన్ చెరువుల్లో సాగుతున్న మట్టి మాఫియా వెనుక ఆ శాఖలో పనిచేస్తున్న ఓ కీలకాధికారి ప్రముఖ పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవహారాన్ని వెనుక నుంచి నడిపిస్తూ.. ప్రతిఫలంగా భారీ ఎత్తున ముడుపులు పొందుతున్నారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకుంటున్నారు. రామాయపట్నం వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీకి మేరవ తోలేందుకు అవసరమైన మట్టిని సమీపంలోని చెరువుల్లో తవ్వుకునేందుకు సదరు అధికారి అనధికారికంగా ఇచ్చిన పర్మిషన్‌కు గానూ సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి దాదాపు రూ.80 వేలు ముట్టాయని సమాచారం. వెంచర్లు, పెట్రోల్ బంకులకు తరలించిన మట్టికి లక్షల్లో ముడుపులు అందాయనే చర్చా లేకపోలేదు.

కీలకాధికారి పాత్ర

కీలకాధికారి పాత్ర