
పొగాకు రైతులను ఆదుకో బాబూ
ఆత్మకూరు: అధిక పెట్టుబడులు, పెరిగిన కౌలు, పడిపోతున్న ధరలతో పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎప్పుడో ప్రారంభించిన వాటికి మళ్లీ మళ్లీ ప్రారంభోత్సవాల పేరుతో శిలాఫలకాలకు ప్రజాధనం దుర్వినియోగం చేయడం, ప్రచారం కోసం కూలీలతో మాట్లాడడం, ప్రతి నెలా ఇచ్చే పింఛన్లను ఇవ్వడం చూసి జనం నవ్విపోతున్నారని, సిగ్గుపడాలన్నారు. ఇదే ప్రాంతంలో పొగాకు రైతులు గిట్టుబాటు ధరలు లేక అల్లల్లాడుతుంటే వారిని గాలికి వదిలేసి.. ప్రజాధనం ఖర్చు చేసి ప్రచారం చేసుకున్నారంటూ విక్రమ్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పొగాకుకు ఏ మేరకు గిట్టుబాటు ధర లభించిందో ఆ రైతులను అడిగి తెలుసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిలోపే గిట్టుబాటు ధరల్లేక వరి, పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కొన్ని చోట్ల పొగాకు ఉత్పత్తులను తగులబెట్టడం, కొన్ని చోట్ల ఆత్మహత్యలకు సిద్ధం అవుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది సాగు ఖర్చులు 30 నుంచి 40 శాతం పెరిగితే.. ధరలు మాత్రం నాణ్యమైన పొగాకుకు 30 శాతం, సగటు ధరలు 50 శాతం మేర తగ్గాయన్నారు. గతేడాది కేజీ రూ.390లకు విక్రయిస్తే.. ఈ ఏడాది రూ.280, సగటు ధర రూ.210లకు పడిపోయిందన్నారు. ఈ విషయాలు తెలుసుకున్న వెంటనే తాను పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడానని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు.
మా అన్న మంత్రిగా ఉండగానే ప్రారంభిస్తే..
గత ప్రభుత్వ కాలంలో మా సోదరుడు, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కోట్లాది రూపాయలు నిధులు కేటాయించి ఎంఎస్‌ఎంఈ పార్కును అభివృద్ధి చేయడంతోపాటు అదనంగా 74 ఎకరాలు సేకరించి సిద్ధం చేసి, నాటి కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారన్నారు. మా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన వాటికి సీఎం, మంత్రులు సిగ్గులేకుండా ఆర్భాటంగా మళ్లీ ప్రారంభోత్సవం చేయించడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఇంత దూరం వచ్చిన సీఎం చంద్రబాబు దృష్టికి డీసీపల్లి పొగాకు బోర్డు పరిధిలోని రైతుల పరిస్థితిని మంత్రి ఆనం వివరించి సీఎం ద్వారా గిట్టుబాటు ధరలను లభించేలా చేసి ఉంటే బాగుండేదన్నారు. గతంలో మేకపాటి గౌతమ్‌రెడ్డి పొగాకు ధరలు మందగించిన క్రమంలో చొరవ చూపి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించి రైతులకు నష్టం వాటిల్లకుండా తీసుకున్న చర్యలను విక్రమ్‌రెడ్డి గుర్తు చేశారు. రానున్న మూడు నెలల పొగాకు అమ్మకాలు జరిగే ఈ సీజన్‌లో రైతులను ఆదుకునేలా వారికి గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రైతులతో కలిసి రోడ్డెక్కే పరిస్థితి నెలకొంటుందని ఆయన హెచ్చరించారు.
ప్రారంభించిన వాటికి మళ్లీ కూటమి శిలాఫలకాలు
పొగాకు రైతుల గోడు పట్టదా