
ప్రవచన సుధాకరుని వేణునాదం పుస్తకాన్ని ప్రదర్శిస్తున్న వెంకయ్యనాయుడు తదితరులు
● మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
నెల్లూరు(బృందావనం): ‘నేను వీఆర్ కళాశాలలో చదువుకునే రోజుల్లో తెలుగు భాషపై అభిమానాన్ని కలిగించిన వారిలో మోపూరు వేణుగోపాలయ్య ఒకరు. ఇంకా పోలూరు హనుమజ్జానకీశర్మ ఎంతో ప్రోత్సహించారు. నాలోని నాయకత్వ లక్షణాలను, మాటతీరును గుర్తించిన వారు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతావంటూ నాడే భవిష్యత్‌ను నిర్ణయించారు. వారి అనుగ్రహంతో రాజకీయంగా ఉన్నతంగా ఎదిగి ఉపరాష్ట్రపతినయ్యా. గురువులసూచనలు, సలహాలు నేటికీ పాటిస్తున్నా.’ అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ప్రవచన సుధాకరులు, నెల్లూరు వీఆర్ కళాశాల విశ్రాంత తెలుగు అధ్యాపకుడు, వెంకయ్యగురువు అయిన మోపూరు వేణుగోపాలయ్య స్మృత్యంకంగా స్మారక సాహితీ సంచిక కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ‘గురువుకు వందనం’ కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరులోని శ్రీకస్తూరిదేవి విద్యాలయం ప్రాంగణంలో ఉన్న రవీంద్రనాథ్‌ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొని వేణుగోపాలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ‘ప్రవచన సుధాకరుని వేణునాదం’ పేరుతో రూపొందించిన మోపూరు వేణుగోపాలయ్య స్మారక సాహితీ సంచికను వెంకయ్య ఆవిష్కరించారు. సంచికను రూపకల్పన చేసిన బృంద సభ్యులు మెట్టు రామచంద్రప్రసాద్, కొండా వెంకటస్వామిరెడ్డి, టి.వెంకటరమణయ్య, తుంగా శివప్రభాత్‌రెడ్డి తదితరులను అభినందించారు. ఆయన మాట్లాడుతూ తెలుగు అధ్యాపకుడిగా, రచయితగా, ప్రవచనకర్తగా మహోన్నతమైన సేవలందించిన ఉన్నతులు వేణుగోపాలయ్య అని కొనియాడారు. గురువులకు ఇచ్చిన మాట ప్రకారం నేటికీ పుస్తక పఠనం చేస్తున్నట్లు చెప్పారు. శాంతా బయోటెక్స్ వ్యవస్థాపక చైర్మన్ పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ 1963–67 వీఆర్ కళాశాలలో తాను వేణుగోపాలయ్య వద్ద విద్యనభ్యసించానని, అప్పటి గురువుల బోధనల వల్లే తెలుగుభాషను స్పష్టంగా మాట్లాడగలుగుతున్నామని తెలిపారు. వేణుగోపాలయ్య వంటి గురువులు సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎం.వి.రాయుడు మాట్లాడుతూ మోపూరు వేణుగోపాలయ్య సాహితీ సంచికలోని అంశాలను వివరించారు. ముఖ్య సమన్వయకర్త టి.రమణయ్య మాట్లాడుతూ వేణుగోపాలయ్య జీవిత విశేషాలను, గురువుగా ఆయన సాగించిన ప్రస్థానాన్ని వివరించారు. లాయర్ వారపత్రిక సంపాదకుడు తుంగా శివప్రభాత్‌రెడ్డి మాట్లాడుతూ మోపూరు వేణుగోపాలయ్యకు సాహితీ సంచిక ద్వారా ఘన నివాళులర్పించడం జరిగిందన్నారు. తొలుత లక్ష్మీప్రసూన శిష్యబృందం ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు అలరించాయి. కార్యక్రమంలో మెట్టు రామచంద్రప్రసాద్, రమణయ్య, కొండా వెంకటస్వామిరెడ్డి, మజ్జిగ ప్రభాకర్‌రెడ్డి, మల్లెల శ్రీహరి, నలుబోలు బలరామయ్యనాయుడు, మద్దూరు శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, శ్రీకాంత్, రవీంద్రబాబు పాల్గొన్నారు.