పొంగుతున్న వాగులు
● వర్షాలు తగ్గుముఖం
నెల్లూరు(అర్బన్): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయువ్య దిశగా పయనిస్తుండటంతో జిల్లాపై ఉన్న తీవ్ర ప్రభావం తగ్గింది. జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి వర్షాలు దాదాపుగా ఆగిపోయాయి. అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. అయితే గురువారం సాయంత్రం నుంచి పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు ప్రారంభమయ్యాయి. బొగ్గేరు, సంగం వద్ద ఉన్న బీరాపేరు పొంగి ప్రవహిస్తున్నాయి. సోమశిల నుంచి విడుదల చేసిన నీటితో పాటు స్థానికంగా కురిసిన వర్షాలతో పెన్నాలో ప్రవాహం పెరిగింది. పలుచోట్ల చెరువులు నిండి కలుజులు ప్రవహిస్తున్నాయి. అనంతసాగరం, చేజర్ల, కందుకూరు తదితర ప్రాంతాల్లో కోతకొచ్చిన వరి పంట నీటిలో నానుతోంది. చిప్పలేరు, పిల్లాపేరు, మిడత వాగు, పైడేరు, పంబలేరు, కొమ్మలేరు, చేజర్ల నల్లవాగు తదితర ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు ప్రాజెక్ట్‌కు వరదనీరు పెద్ద ఎత్తున చేరుతోంది. పలు ప్రాంతాల్లోని లోతట్టు కాలనీలు నీటిలో నానుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వర్షాలు తగ్గుముఖం పట్టినా ముప్పు ఇంకా తొలగలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా కోరారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపిందన్నారు. అత్యవసరమైతే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 0861 – 2331261, 79955 76699 నంబర్లను 24 గంటల పాటు ఎప్పుడైనా సంప్రదించి సాయం పొందవచ్చని తెలిపారు.
పొంగుతున్న వాగులు


