వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ల ఆవిష్కరణ
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28న చేపట్టనున్న ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను పార్టీ నేతలు గురువారం ఆవిష్కరించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు సీఎం చంద్రబాబు అప్పనంగా కట్టబెట్టడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రైవేట్‌కు అప్పగిస్తున్నామంటూ వాటిని మంత్రులు, ఎమ్మెల్యేలకు కారు చౌకగా విక్రయిస్తున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేశానని చెప్పుకొనే చంద్రబాబు.. రాష్ట్రానికి ఇప్పటివరకు ఒక్క మెడికల్ కళాశాలనూ తీసుకురాలేకపోయారని విమర్శించారు. పది మెడికల్ కళాశాలలను పూర్తి చేయాలంటే రూ.4800 కోట్ల ఖర్చవుతుందని.. రూ.మూడు లక్షల కోట్ల బడ్జెట్ గల రాష్ట్రంలో ప్రజారోగ్యానికి ఈ మొత్తాన్ని ఖర్చు చేయలేరానని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గానికి 60 వేల సంతకాలను సేకరించాలని ఆయన ఆదేశిస్తే.. లక్ష సంతకాలను చేపట్టే దిశగా కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలను ఈ నెల 28న చేపట్టి తహసీల్దార్, ఆర్డీఓ, డీఆర్వో కార్యాలయాల్లో అధికారులకు వినతిపత్రాలను అందజేయనున్నామని ప్రకటించారు.
నిరసనలను ఉధృతం చేయాలి
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలను మరింత ఉధృతం చేయనున్నామని పార్టీ రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పేర్కొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నా, పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం ముందుకెళ్లడం దారుణమన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు వైద్య విద్యనందించాలనే లక్ష్యంతో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు జగనన్న సంకల్పించారని వివరించారు. అయితే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, తమ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ధ్వజమెత్తారు. తాము చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఊహించని మద్దతు లభిస్తోందని వివరించారు. ప్రజా ఉద్యమం ర్యాలీకి భారీగా తరలిరావాలని కోరారు. చంద్రబాబు నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఎమ్మెల్సీ, పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ పేర్కొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడారు. ప్రజల అభిప్రాయాలు గవర్నర్‌కు తెలియజేసేలా, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పేరుతో జరుగుతున్న దోపిడీని అడ్డుకునేలా ఒక ఉద్యమంతో సంతకాల సేకరణను చేపట్టామని వివరించారు.


