హోటల్లో పేకాటపై పోలీసుల సీరియస్
● హెడ్‌కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు
● కృష్ణసింగ్‌పై కఠిన చర్యలకు రంగం సిద్ధం?
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు శోధన్ నగర్‌లోని యష్‌పార్క్ హోటల్ గదిలో బుధవారం గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 18 మందిని పోలీసుల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూదమాడిన వారిలో ఉన్న విడవలూరు హెడ్‌కానిస్టేబుల్ జీకేఎస్ పుల్లారెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఎస్పీ అజిత గురువారం ఉత్తర్వులు జారీచేశారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణసింగ్‌పై పీడీ యాక్ట్?
ఇదిలా ఉండగా పట్టుబడిన వారిలో బెట్టింగ్ డాన్ కృష్ణసింగ్ ఉన్నాడు. అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కృష్ణసింగ్‌పై జిల్లాలో పలు కేసులు ఉండగా దర్గామిట్ట పోలీసుస్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ ఉంది. పలుమార్లు పోలీసులు అతడిని అరెస్ట్ చేసినా తీరులో మార్పురాలేదు. చిన్నబజారు పోలీస్‌స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పేకాటాడుతూ నెలరోజుల వ్యవధిలో రెండుసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఆరాతీశారు. సస్పెక్ట్ షీట్ ఈ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ కానుంది. త్వరలో అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
మేనేజర్‌పై కేసు
జూద నిర్వాహకుడికి సహకరించిన హోటల్ మేనేజర్‌పై చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. నెల్లూరు నగరానికి చెందిన దేమునాయుడు వ్యసనాలకు బానిసయ్యాడు. వాటిని తీర్చుకునేందుకు సరిపడా నగదు కోసం అతను స్నేహితులతో కలిసి పేకాటాడుతూ ఆర్థికంగా నష్టపోయాడు. ఎలాగైనా నగదు సంపాదించాలని నిర్ణయించుకుని యష్ పార్క్ హోటల్ మేనేజర్ రత్నంతో పరిచయం చేసుకున్నాడు. హోటల్లో పేకాటకు అనుమతిస్తే కమీషన్ కింద రూ.2 వేలు ఇచ్చేలా మేనేజర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం దేమునాయుడు తన స్నేహితులు, పరిచయస్తులతో హోటల్లో పేకాటాడిస్తున్నాడు. బుధవారం పోలీసులు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మేనేజర్ పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని అరెస్ట్ చేశారు.


